తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్యాంకులకు వచ్చే జనంపై యుద్ధ ట్యాంకులతో గురి! చైనాలో అంతే!! - పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా

China bank crisis: స్వదేశీ పౌరులపైనే చైనా యుద్ధ ట్యాంకులు బ్యారెల్స్‌ను ఎక్కుపెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రజల సొమ్మును డిపాజిట్లుగా తీసుకొని అవకతవకలకు పాల్పడి ఎగ్గొట్టిన బ్యాంకులకు రక్షణగా ఇలా ప్రభుత్వం చేస్తోందని అంటున్నారు. అటువంటిదేమీ లేదని చైనా విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం చైనాలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా అవి తీవ్రతరమయ్యాయి.

china war tanks
ఆందోళనలు చేస్తున్న ప్రజలు

By

Published : Jul 22, 2022, 1:10 PM IST

China bank crisis: చైనాలో యుద్ధ ట్యాంకులకు ఓ రక్త చరిత్ర ఉంది. తియాన్మన్‌ స్క్వేర్‌లో ఇవి స్వదేశీ పౌరులనే చక్రాల కింద వేశాయి. తాజాగా మరోసారి స్వదేశీ పౌరులపైనే చైనా యుద్ధ ట్యాంకులు బ్యారెల్స్‌ను ఎక్కుపెట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ అయ్యాయి. అది కూడా వారి సొమ్మును డిపాజిట్లుగా తీసుకొని అవకతవకలకు పాల్పడి ఎగ్గొట్టిన బ్యాంకులకు రక్షణగా..? చైనాకు చెందిన విశ్లేషకులు మాత్రం అబ్బే అటువంటిదేమీ లేదు అని అంటున్నారు. ట్యాంకుల సంగతి ఎలా ఉన్నా.. చైనాలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా అవి తీవ్రతరమయ్యాయి. వీటిని ఎలాగైనా అణచివేయాలని షీ జిన్‌పింగ్‌ సర్కారు ప్రయత్నిస్తోంది.

షాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో రోడ్డెక్కిన ఇనుప చక్రాలు..తాజాగా ది బ్యాంక్‌ ఆఫ్‌ చైనా బ్రాంచి ప్రజల డిపాజిట్లను పెట్టుబడులుగా మార్చినట్లు ప్రకటించింది. దీంతో అక్కడి ప్రజలు బ్యాంకుల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో షాన్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని రిఝోలోని ఓ బ్యాంకు వద్ద రక్షణగా యుద్ధట్యాంకులు ఉన్న వీడియో వైరల్‌గా మారింది. చాలా ఆంగ్ల పత్రికలు.. ఈ ట్యాంకులు బ్యాంకు రక్షణ కోసం వచ్చినవే అని కథనాలు ప్రచురించాయి. కానీ, బ్లాగర్‌ జెన్నిఫర్‌ జెంగ్‌ వంటి వారు రిఝె వద్ద నౌకాదళ స్థావరం ఉండటంతో ట్యాంకులు వెళుతున్నాయనీ.. ఇది ఏటా సర్వసాధారణమే అని పేర్కొంటున్నారు. ట్యాంకుల మోహరింపు ఎలా ఉన్నా.. గ్రామీణ బ్యాంకులపై చైనా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నది మాత్రం వాస్తవం.

హెనాన్‌ ప్రావిన్స్‌లో రాజుకొన్న అగ్గి..జులై 10వ తేదీన చైనా సోషల్‌ మీడియా వీబొలో కొందరు డిపాజిటర్లు గ్రామీణ బ్యాంకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు. ఆ తర్వాత దాదాపు 1,000 మంది హెనాన్‌ రాజధాని జియాంగ్‌ఝూలో ఆందోళనలు మొదలుపెట్టారు. హఠాత్తుగా సాధారణ దుస్తుల్లో ఉన్న భద్రతాదళ సిబ్బంది దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ ఘటన ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ మర్నాడు నుంచి 50,000 యువాన్లలోపు విత్‌డ్రాలకు అంగీకరించారు. వచ్చే వారం నుంచి 1,00,000 యువాన్ల వరకు అనుమతి లభించవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. స్తంభింపజేసిన మొత్తాలను విడతల వారీగా అందజేస్తామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో ఓ యాప్‌ ద్వారా చైనా ప్రభుత్వం ప్రజల డేటాను సమీకరించింది. తాజాగా ఆ యాప్‌ను ఉపయోగించుకొని పోలీసులు ఆందోళనకారుల ఫోన్లను ట్రాక్‌ చేశారు.

ఆందోళనలు చేస్తున్న ప్రజలు

ఏప్రిల్ నెలలో చైనాలోని హెనాన్‌, ఎన్‌హైల్లోని బ్యాంకులు నగదు విత్‌డ్రాలను నిలిపివేసినట్లు కస్టమర్లకు తెలియజేయడంతో సమస్య మొదలైంది. షాంఘై హుమిన్‌ కౌంటీ బ్యాంక్‌, యుజౌ జిన్‌ మిన్‌షెంగ్‌ విలేజ్‌ బ్యాంక్‌, న్యూ ఓరియంటల్‌ కంట్రీ బ్యాంక్‌ ఆఫ్‌ కైఫెంగ్‌, జెచెంగ్‌ హువాంగ్వాయ్‌ కమ్యూనిటి బ్యాంక్‌, గుజెన్‌ జిన్‌హవాయ్‌ విలేజ్‌ బ్యాంక్‌లు తమ డిపాజిట్‌ దారుల ఖాతాలను స్తంభింపజేసినట్లు ప్రకటించాయి. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు అంచనాల ప్రకారం ఈ మొత్తం 1.5 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. ఈ బ్యాంకులు డిపాజిట్‌దారులకు 4.5శాతం వడ్డీరేటును ఆశ చూపాయి. చైనాలో సాధారణ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే 2.75 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ.

  • చైనాలో అన్నిరకాల చిన్న బ్యాంకులు కలిపి 4,000 వరకు ఉండొచ్చని అంచనా. వీటి వద్ద మొత్తం 14 ట్రిలియన్‌ డాలర్ల నిధులు ఉన్నాయి. ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫామ్‌లను వాడుకొని డిపాజిట్లను సమీకరించవద్దని 2021లో చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ బ్యాంకులను ఆదేశించింది. దీంతో చిన్న బ్యాంకుల వ్యాపారం బాగా దెబ్బతింది.
  • హెనాన్‌ ప్రావిన్స్‌లోని శక్తిమంతమైన జింకైఫూ గ్రూప్‌నకు ఈ బ్యాంకుల్లో వాటాలు ఉన్నాయి. ఈ గ్రూపు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను వాడుకొని ప్రజల సొమ్మును సమీకరించింది. ఆ తర్వాత చాలా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

1,600 గ్రామీణ బ్యాంకుల పరిస్థితి ఏమిటో..చైనాలో బ్యాంకులపై పటిష్ఠమైన నిఘా ఉంటుందని పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(పీబీఓసీ) చెబుతోంది. కానీ, మొత్తం 4,398 చైనా బ్యాంకుల్లో 24 మాత్రమే సురక్షితమైనవని గతేడాది నాలుగో త్రైమాసిక నివేదికలో పీబీవోసీ పేర్కొంది. 316 బ్యాంకులు అత్యధిక రిస్క్‌ జోన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఇది మొత్తం బ్యాంకుల్లో దాదాపు 0.9శాతానికి సమానం. దీనికి చైనాలోని టుమారో గ్రూపు నిర్వహించిన బోషాంగ్‌ బ్యాంక్‌ ఉదాహరణ. కెనడాకు చెందిన చైనా వ్యాపారవేత్త ప్రారంభించిన ఈ బ్యాంక్‌ 209 షెల్‌ కంపెనీలను చూపి రుణదాతల నుంచి 23 బిలియన్‌ డాలర్ల విలువైన సొమ్మును సేకరించింది. ఆ తర్వాత ఆ సొమ్ము చెల్లించలేకపోయింది.

చైనాలో రియల్‌ఎస్టేట్‌ మార్కెట్‌ దారుణంగా దెబ్బతింది. ఫలితంగా 1,600 చిన్న బ్యాంకులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు రియల్‌ఎస్టేట్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాయి. ఫలితంగా స్థిరాస్తి రంగ ప్రతికూల ప్రభావం మెల్లగా ఆర్థిక రంగంపై పడటం మొదలైంది. అదే సమయంలో డిపాజిట్లను స్తంభింపజేయడం ప్రజల్లో ఆందోళన పెంచింది.

ఇవీ చదవండి:లంక కొత్త అధ్యక్షుడిగా విక్రమసింఘె ప్రమాణం.. గొటబాయకు టూరిస్ట్​ వీసా!

ఇటలీ ప్రధాని రాజీనామా.. 17 నెలలకే ముగిసిన పాలన

ABOUT THE AUTHOR

...view details