తెలంగాణ

telangana

ETV Bharat / international

కొంపముంచిన కొవిడ్ వ్యూహం... జిన్​పింగ్ వైఫల్యంతో 3 లక్షల మంది మృతి! - zero covid policy pros and cons

జీరో కొవిడ్ విధానాన్ని ఆకస్మాత్తుగా ఎత్తివేయడం చైనా కొంపముంచిందా? మిలియన్ల కొద్ది మరణాలకు ఇది కారణమైందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. చైనాలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగడం వల్ల జీరో కొవి‌డ్‌ విధానాన్ని హఠాత్తుగా డ్రాగన్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. ఎటువంటి ముందుస్తు జాగ్రత్తలు లేకుండా జీరో కొవిడ్‌ విధానానికి ముగింపు పలకడం వల్ల ఆ దేశంలో లక్షలాది మరణాలు నమోదయ్యాయి. దీనికి అక్కడి ప్రభుత్వ వైఫల్యం కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

china covid restriction
zero-covid-exit-cost-lives china

By

Published : Mar 21, 2023, 4:51 PM IST

కొవిడ్‌ను నియత్రించడానికి తీసుకొచ్చిన 'జీరో కొవిడ్' విధానాన్ని హఠాత్తుగా చైనా ఎత్తివేయడం ఆ దేశంలో లక్షలాది మంది మరణాలకు కారణమైందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎటువంటి ముందుస్తు ప్రణాళికలు లేకుండా ఒక్కసారిగా జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడం వల్ల ఈ మరణాలు సంభవించాయని నిపుణులు అంటున్నారు. డ్రాగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం వల్ల గతేడాది డిసెంబర్‌లో జీరో కొవిడ్‌ విధానానికి చైనా ముగింపు పలికింది. అయితే హఠాత్తుగా దీన్ని ఎత్తివేయకుండా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసి, యాంటీ వైరల్‌ ఔషధాల స్టాక్‌ ఉంచుకున్నట్లయితే 2 నుంచి మూడు లక్షల మరణాలను చైనా నివారించగలిగేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జీరో కొవిడ్ విధానం ఎత్తివేసిన ఆరు వారాల్లోనే 80శాతం మందికి కొవిడ్‌ వేగంగా వ్యాపించినట్లు చైనా వ్యాధుల నియంత్రణ సంస్థ అంచనా వేసింది. దీని కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినా చైనా మాత్రం 90 వేల మంది మాత్రమే మరణించినట్లు చెబుతోంది. జీరో కొవిడ్‌ విధానం ఎత్తివేసే నాటికి చైనాలో చాలా మంది ప్రజలకు టీకాలు పూర్తిగా వేయలేదని, ముఖ్యంగా వృద్ధులకు టీకాలు అందించడంలో చైనా ప్రభుత్వం విఫలమైందని నిపుణులు తెలిపారు. దుకాణాలలో సరిపడా యాంటీ వైరల్‌ ఔషధాలు కూడా లేవని వెల్లడించారు. ఆసుపత్రులలో తగినంత వైద్య సిబ్బంది, వైద్య సామగ్రి, సరైన వసతులు కూడా లేవని ఆరోపించారు. సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించిదని చైనా వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. శీతాకాలంలో వైరస్ చాలా తేలికగా వ్యాపించే సమయంలో అకస్మాత్తుగా జీరో కొవిడ్‌ విధానానికి ముగింపు పలకడం చైనాలో పరిస్థితిని మరింత దిగజార్చింది.

ప్రపంచ దేశాలన్నీ కొవిడ్‌తో సహజీవనం చేస్తుంటే.. చైనా మాత్రం జీరో కొవిడ్ విధానాన్ని పాటిస్తూ తలుపులు మూసేసుకొంది. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నా, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నా నిబంధనలను మార్చేందుకు మెదట్లో విముఖత చూపించింది. అయితే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చైనా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఎక్కడికి వెళ్లాలన్నా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనను వ్యతిరేకించారు. భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఏకంగా జిన్​పింగ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అప్పట్లో సంచలనమైంది. పదవి నుంచి జిన్​పింగ్ దిగిపోవాలని, కమ్యూనిస్టు పార్టీ డౌన్​డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొవిడ్ ఆంక్షలను సడలించాలంటూ ప్రదర్శన చేశారు. ఫలితంగా జిన్​పింగ్ సర్కారు దిగి వచ్చింది. నిరసనకారులకు తలొగ్గింది. చైనాలో కొవిడ్ ఆంక్షలను సడలించింది. అదే దేశంలో మరణ మృదంగానికి కారణమైంది.

ABOUT THE AUTHOR

...view details