చైనా నగరం షాంఘైను లాక్‌డౌన్ భయాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఒక్కరోజే అక్కడ 47 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. జీరో కొవిడ్ విధానంతో తీవ్ర ఇబ్బందులు పడుతోన్న చైనా వాసులు మూడు నెలల గరిష్ఠస్థాయి కేసులను చూసేసరికి ఆందోళనకు గురవుతున్నారు. కొన్ని నెలల క్రితమే లాక్‌డౌన్‌తో షాంఘై ఉక్కిరిబిక్కిరి అయింది.
రెస్టారెంట్లు, బార్లు, పార్కులు, దుకాణాలు అన్నీ మూతపడగా కొద్ది రోజులుగా పరిస్థితులు సద్దుమణిగాయి. తాజాగా షాంఘైలో 47 కేసులు, బీజింగ్‌లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. జులై 12 తర్వాత ఇదే అత్యధికం. ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు మొదలవుతున్న వేళ లాక్‌డౌన్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించే నాయకులు.. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి.
ఆందోళనలపై ఉక్కుపాదం...
కరోనా కట్టడిలో భాగంగా చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న జీరో కొవిడ్ విధానం అత్యంత కఠినంగా వ్యవహరించే చైనా ప్రభుత్వంపై ఆందోళనలు వేళ్లూనుకుంటున్నాయి. కమ్యూనిస్టు పార్టీ 20వ సర్వసభ్య సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజధాని బీజింగ్‌లోని రద్దీ కూడలిలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఉద్యమకారులు ఆవిష్కరించారు. వెంటనే స్పందించిన ప్రభుత్వం వాటిని తొలగించింది. భారీ బలగాలతో కూడిన బందోబస్తును అక్కడ ఏర్పాటు చేసింది.