మావో జెడాంగ్ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా షీ జిన్‌పింగ్‌ను ప్రతిష్ఠించడమే ప్రధాన అజెండాగా సాగిన చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభలు శనివారంతో ముగిశాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు.. గత ఆదివారం రాజధాని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో ప్రారంభమయ్యాయి. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి 2,300 మంది హాజరైన ఈ సమావేశాల్లో.. 370 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ కమిటీని ఎన్నుకున్నారు.
అయితే ఈ సెంట్రల్ కమిటీ.. ఆదివారం మరోసారి సమావేశమై 25 మంది నాయకులతో పొలిటికల్ బ్యూరోను ఎన్నుకోనుంది. అనంతరం ఈ పొలిటికల్ బ్యూరో.. ఏడుగురు సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనుంది. ఆ తర్వాత శక్తిమంతమైన స్టాండింగ్ కమిటీ.. జనరల్ సెక్రటరీ( పార్టీ అధ్యక్షుడు) పేరును ప్రకటించనుంది. ఇప్పటికే జిన్‌పింగ్‌కు మూడోసారి పగ్గాలు అప్పగించేందుకు సెంట్రల్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు ఆదివారం అధికారికంగా ప్రకటించనున్నారు.
పార్టీతో పాటు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించిన జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన జిన్ పింగ్, ఒక వ్యక్తి రెండుసార్లు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.