2008 నవంబర్ 26 నాటి ముంబయి దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది.. సాజిద్ మీర్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చే ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. సాజిద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం సహా అతడి ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని భద్రతామండలిలో అమెరికా, భారత్ ప్రతిపాదించాయి. దీనికి భద్రతా మండలిలోని ఇతర దేశాలు ఆమోదం తెలపగా ఒక్క చైనా మాత్రం హోల్డ్‌లో పెట్టి అడ్డుకుంది. ఫలితంగా సాజిద్ మీర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.
పాకిస్థాన్ ఉగ్రవాదులపై నిషేధం విధించేలా అమెరికా, భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా అడ్డుపడడం గత నాలుగు నెలల్లో ఇది మూడోసారి. ఈ ఏడాది జూన్‌లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనకు.. చైనా చివర్లో అడ్డుపడింది. ఆగస్టులో జైషే మహ్మద్ ఉగ్ర ముఠా చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజార్‌పై ఆంక్షలు విధిస్తూ భారత్, అమెరికా తీసుకొచ్చిన తీర్మానాన్ని కూడా చైనా హోల్డ్‌లో పెట్టింది.