china child policy: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా ప్రస్తుతం.. తగ్గిపోతోన్న జననాల రేటుతో కలవరపడుతోంది. 2025 నాటికి దేశంలో జనాభా తగ్గుదల ప్రారంభమవుతుందని స్థానిక అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దేశ జనాభా పెంచేందుకు డ్రాగన్ ముమ్మర చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పిల్లలను కనేలా కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. జనాభా పెంపు చర్యలపై వ్యయాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా పిల్లల సంరక్షణ సేవలను మెరుగుపరచాలని కేంద్ర, ప్రాంతీయ ప్రభుత్వాలకు సూచించింది.
'స్థానిక ప్రభుత్వాలు జనాభా పెంపు చర్యలను క్రియాశీలకంగా అమలు చేయాలి. యువ జంటలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు, మెరుగైన ఆరోగ్య బీమా అందజేయాలి. విద్య, గృహవసతి, ఉపాధి కల్పనకు మద్దతు అందించాలి. పిల్లల సంరక్షణ సేవల కొరతను తగ్గించేందుకుగానూ.. ఈ ఏడాది చివరి నాటికి చిన్నారుల కోసం తగినన్ని నర్సరీలు ఏర్పాటు చేయాలి' అని జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. అధిక సంతానం దిశగా మహిళలను ప్రోత్సహించేందుకుగానూ ఇప్పటికే ఇక్కడి సంపన్న నగరాలు.. వారికి పన్ను రాయితీలు, గృహ రుణాలు, విద్యా ప్రయోజనాలు, నగదు ప్రోత్సాహకాలనూ అందజేస్తున్నాయి. ఇటువంటి చర్యలను అమలు చేసేందుకు అన్ని ప్రావిన్సులూ ముందుకు రావాలని కోరింది.