China Air Jet Emergency Landing :చైనాకు చెందిన ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 146 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. వాటి పొగలు క్రమంగా క్యాబిన్లోకి వ్యాపించాయి. దీంతో సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు సిబ్బంది. అనంతరం ప్రయాణికులను కిందకు దింపారు. ఈ క్రమంలోనే తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలపాలయ్యారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన A320 నంబర్ గల విమానం.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూ నగరం నుంచి వచ్చింది. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది అత్యవరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులు కిందకు దింపారు. ఉక్కిరిబిక్కిరి చేసే పొగ, హడావుడిగా ప్రయాణికులను కిందకు దింపే క్రమంలో 9 మందికి గాయాలయ్యాయి.
"విమానం ఫార్వర్డ్ కార్గో హోల్డ్, మరుగుదొడ్డిలోకి పొగలు వ్యాపించాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాం. ప్రయాణికులు ఆందోళన చెందకుండా ముందే వారిని హెచ్చరించాం." అని విమాన సిబ్బంది తెలిపారు. విమానం ల్యాండింగ్ అనంతరం మంటలు అర్పివేశారు సహాయక సిబ్బంది. మెకానికల్ సమస్య కారణంగానే ఈ ప్రమాదం తలెత్తినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు చైనా అధికారులు. దీనిపై మరింత విచారణ జరుపుతామని వారు వెల్లడించారు.