Canada PM Trudeau Statement On India :ఖలిస్థానీ మద్దతుదారుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య.. వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం చేసిన సంచలన ఆరోపణలు దుమారం రేపాయి. తాజాగా ట్రూడో ఈ వ్యవహారంపై మరోసారి స్పందించారు. భారత్‌ను తాము రెచ్చగొట్టాలని అనుకోవడం లేదని, ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదని అన్నారు. సిక్కు నేత, కెనడా పౌరుడి హత్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలని భారత్‌ను కోరుతున్నామని తెలిపారు. ప్రతి విషయం స్పష్టంగానే ఉందని.. సరైన ప్రక్రియలో జరుగుతోందని నిర్ధరించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలని అకుంటున్నట్లు ట్రూడో చెప్పారు.
ఇదిలా ఉండగా.. కెనడా మరో అడుగు ముందుకేసి తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌కు వెళ్లొద్దని కెనడా పౌరులకు సూచించింది. 'అనూహ్యమైన భద్రతా పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లకండి. ఉగ్రవాదం, మిలిటెన్సీ, పౌర అశాంతి, కిడ్నాప్‌ల ముప్పు ఉంది" అని కెనడా తన ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొంది.
India Vs Canada On Khalistan :అంతకుముందు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారిని కెనడా బహిష్కరించింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత్కెనడా దౌత్యవేత్తను కూడా బహిష్కరించి, గట్టి బదులిచ్చింది. ట్రూడో చేసిన ఆరోపణలను 'అసంబద్ధ', 'ప్రేరేప్రితమనవి'గా తోసిపుచ్చింది. "మాది చట్టబద్ధమైన పాలనకు.. బలమైన నిబద్ధత కలిగిన ప్రజాస్వామ్య రాజకీయం. కెనడాలో ఆశ్రయం పొందిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. భారతదేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పును కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై కెనడియన్ ప్రభుత్వంతో.. దీర్ఘకాలంగా, నిరంతరం మా ఆందోళన తెలియజేస్తున్నాం" అని భారత విదేశాంగ ఘాటుగా స్పందించింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిణామాల మధ్య ట్రూడో మరోసారి మాట్లాడటం చర్చనీయాంశమైంది.
ఇది చాలా సీరియస్ మ్యాటర్.. : ఎస్జీపీసీ
హర్‌దీప్ సిగ్ నిజ్జర్ హత్య వ్యవహారంతో భారత్-కెనడా మధ్య తౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో శిరోమని గురుద్వారా పర్బంధక్ కమిటీ- ఎస్జీపీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయం చాలా తీవ్రమైనదని.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. భారత్‌లోని సిక్కుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరింది. విదేశాలలో నివసిస్తున్న సిక్కుల సమస్యలు, మనోభావాలను అర్థం చేసుకుని అర్థవంతమైన పరిష్కారం దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై రెండు దేశాల ప్రభుత్వాలు ఆరోపణలకు బదులు.. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి వారి అజెండాలోకి తీసుకురావాలని ఎస్జీపీసీ చీఫ్ హర్జిందర్ సింగ్ ధామీ పేర్కొన్నారు.