Canada Khalistani Killed :కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు సుఖ్‌దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే హత్యకు గురయ్యాడు. విన్నిపెగ్ పట్టణంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో సుఖదోల్ మరణించినట్టు తెలుస్తోంది. కాల్పుల ఘటనను నిర్ధరించిన విన్నీపెగ్ పోలీసులు.. మృతుల వివరాలపై మాత్రం స్పష్టతనివ్వలేదు. ఈ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకుంది. కెనడా నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెనడాతో దౌత్యపరమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
Sukha Duneke Killed In Canada :పంజాబ్ మోఘా జిల్లాలోని దేవిందర్ బంబిహా గ్యాంగ్‌కు చెందిన ఏ-కేటగిరి గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న సుఖా దునెకేపై భారత్‌లో వివిధ క్రిమినల్ కేసులున్నాయి. పంజాబ్ తదితర రాష్ట్రాల్లో 20కి పైగా క్రిమినల్ కేసులు అతడిపై నమోదయ్యాయి. ఎన్ఐఏ సైతం అతడిపై కేసులు నమోదు చేసింది. 2017లో అతడు నకిలీ ధ్రువ పత్రాలతో కెనడాకు పారిపోయినట్లు సమాచారం. అక్కడకు వెళ్లిన తర్వాత కెనడా కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరినట్లు నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఖలిస్థానీ ఉద్యమంలో సుఖా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడైంది.
పంజాబ్‌కు చెందిన దాదాపు 30 గ్యాంగ్‌స్టర్లు ప్రస్తుతం భారత్‌లో కేసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలకు పారిపోయినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. వీరు తప్పుడు ప్రయాణ పత్రాలతో లేదా దేశ సరిహద్దులు దాటి నేపాల్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ అక్రమంగా ఆశ్రయం పొందుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో 8 మంది కెనడాలో ఉన్నట్లు సమాచారం. అందులో ఒకడైన సుఖా తాజాగా కాల్పుల్లో మరణించాడు. ప్రధానంగా.. దునెకే ఫోన్ కాల్స్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేసేవాడు. కాంట్రాక్ట్ హత్యలు సైతం చేసేవాడు.