Canada India Relationship :భారత్-కెనడా మధ్య విభేదాలు ముదురుతున్నాయి. దీనికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజకీయ బలహీనత ఓ కారణంగా తెలుస్తోంది. ఓ పార్టీ మెప్పు కోసం కెనడా ప్రధాని మొదట్నుంచీ ఖలిస్థానీ విషయంలో పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 2021 తర్వాత నుంచి ట్రూడో ప్రభుత్వ రాజకీయ బలహీనత.. ఖలిస్థానీ వేర్పాటువాదులకు ఆయుధంగా మారింది. 2021 ఎన్నికల్లో హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఉన్న మొత్తం 338 స్థానాల్లో ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ సీట్లు 177 నుంచి 150కి తగ్గాయి. అదే సమయంలో కన్జర్వేటివ్ పార్టీకి 121, నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ-NDPకి 24, బ్లాక్ క్యూబెక్స్‌కు 32, గ్రీన్ పార్టీకి 3, స్వతంత్ర్య అభ్యర్థికి ఒకటి చొప్పున సీట్లు వచ్చాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ట్రూడోకు మరికొన్ని సీట్ల అవసరం వచ్చింది. దీంతో జగ్మీత్ సింగ్ ధాలివాల్-జిమ్మీ నేతృత్వంలోని NDP మద్దతును ట్రూడో తీసుకొన్నారు. NDP నాయకులు ఇప్పటికే పలు మార్లు ఖలిస్థానీ వేర్పాటువాదులకు, వారి ఎజెండాకు మద్దతు పలికారు. 2013లో జగ్మీత్‌కు భారత్ వీసాను తిరస్కరించింది. ప్రస్తుతం అటువంటి వ్యక్తి నేతృత్వంలోని NDP... ట్రూడో ప్రభుత్వానికి ప్రాణవాయువు అందిస్తోంది. ఈ జగ్మీత్ సింగ్ కేవలం ఖలిస్థానీ వేర్పాటువాదానికే పరిమితం కాలేదు.. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపును కూడా వ్యతిరేకించాడు.
Justin Trudeau Khalistan :2019 తర్వాత నుంచి జగ్మీత్ సింగ్ బృందం ఖలిస్థాన్ విషయంలో మరింత చురుగ్గా పనిచేస్తోంది. మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో భారత దౌత్య కార్యాలయాలు, ప్రజలు, ఆలయాలపై ఖలిస్థానీల దాడులు పెరిగాయి. ముఖ్యంగా కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ఇటీవల పలు ఘటనలు జరిగాయి. మార్చిలో లండన్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయంపై దాడి జరిగింది. భారత పతాకాన్ని అవమానించారు. జూన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ కెనడాలోని ఖలిస్థానీ మద్దతుదారులు కార్యక్రమాలు చేపట్టారు. టొరొంటోలోని పంజాబీ పత్రిక సంజ్ సవేర.. ఇందిరాగాంధీ హత్యను కీర్తిస్తూ కవర్‌స్టోరీ రాసింది. దీన్ని భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ఖండించారు. అంతేకాదు.. ఇది ఓటు బ్యాంక్ రాజకీయాలని విమర్శించారు.
Canada Khalistan Movement :జులైలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ శివార్లలోని మేరీల్యాండ్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు భారతీయ విద్యార్థులపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ తరచూ కెనడాలో ఖలిస్థానీ రెఫరెండాలు నిర్వహిస్తోంది. జులైలో భారత దౌత్యవేత్తలకు, సిబ్బందికి వ్యక్తిగతంగా హానీ చేస్తామంటూ ఖలిస్థానీలు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ పరిస్థితిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. మొక్కుబడిగా భద్రత కల్పించి వదిలేసింది. గతంలో కూడా తరచూ ఖలిస్థానీ రెఫరెండాలకు కెనడా వేదికగా మారింది.