Canada India Dispute :కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలతో భారత్, కెనడా మధ్య సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజారాయి. జస్టిన్ ట్రూడో తండ్రి పిరె ఇలియట్ ట్రూడో కూడా భారత్ పట్ల ఇలాంటి ఘర్షణ వైఖరినే ప్రదర్శించారు. ప్రధాని హోదాలో ఆయన కూడా ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఊతమిచ్చారు. 300 మందికిపైగా భారతీయ ప్రయాణికులతో కూడిన విమానాన్ని గాల్లోనే ఉగ్రవాదులు పేల్చడానికి పరోక్షంగా కారణమయ్యారు.
హెచ్చరికలను పట్టించుకోలేదు..
1985 జూన్ 23న కెనడాలోని టొరంటో నుంచి 329 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 'కనిష్క'ను ఖలిస్థాన్ ఉగ్రవాదులు సూట్‌కేసు బాంబులతో గాల్లోనే పేల్చేశారు. కెనడాలో తలదాచుకున్న ఖలిస్థాన్ ఉగ్రవాది, బబ్బర్ ఖల్సా సభ్యుడు తల్వీందర్ సింగ్ పర్మార్ దీనికి ప్రధాన సూత్రధారి. అతడిని అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను అప్పటి కెనడా ప్రధాని పిరె ట్రూడో తోసిపుచ్చారు. నిజానికి కనిష్క పేలుడుకు కారణమైన పర్మార్ సహా ఇతరులనూ కెనడా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఒక్కరికి (ఇందర్‌జిత్ సింగ్) మాత్రమే 15 ఏళ్ల జైలుశిక్ష విధించి.. మిగతావారిని విడిచిపెట్టింది. ఉగ్రవాదులు విమాన దాడులకు పాల్పడే అవకాశం ఉందని 20 రోజుల ముందే భారత నిఘా వర్గాలు కెనడాకు సూచించాయి. సరైన భద్రత చర్యలు తీసుకోవాలని కోరాయి. పిరె ప్రభుత్వం వాటన్నింటినీ పెడచెవినపెట్టింది.
వాంకోవర్‌లో ఉగ్రవాదులు బాంబులు తయారు చేస్తున్నారనే సమాచారం ఉన్నా కూడా చూసీ చూడనట్లు వ్యవహరించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తర్వాత లభించిన కొన్ని కీలక ఆధారాలను సైతం కెనడా అధికారులు దాచేశారని అంటుంటారు. పిరె ట్రూడో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కనిష్క పేల్చివేత సంభవించిందని చెబుతారు. ఆ ఘటనపై విచారణ జరిపిన జస్టిస్ జాన్ మేజర్ కమిషన్ కూడా కెనడా నిఘా విభాగాన్ని, పోలీసులను, అధికారులను తీవ్రంగా తప్పుబట్టింది. అంతేగాకుండా విచారణకు అడ్డుతగిలినట్లు ఆరోపణలు చేసింది. ఈ ప్రమాదం గురించి కెనడా అధికారులకు ముందే తెలుసని వ్యాఖ్యానించింది.
భారత్‌పై అగ్గిమీద గుగ్గిలం..
అమెరికా, కెనడాల సాయంతో భారత్ అణు ఇంధన కార్యక్రమాలు మొదలుపెట్టింది. శాంతియుత కార్యక్రమాలకే తమ ఒప్పందం పరిమితమని కెనడా, అమెరికా స్పష్టం చేశాయి. 1974లో పోఖ్రాన్‌లో భారత్ అణుపరీక్ష నిర్వహించడం వల్ల పిరె ట్రూడో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. భారత్‌కు అణు సాయం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. తమ దేశ శాస్త్రవేత్తలను వెనక్కి రప్పించారు. నిజానికి కెనడా, అమెరికాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందంలో.. అణుపరీక్ష చేయకూడదనే విస్పష్ట నిబంధనేదీ లేదని తర్వాత తేలింది. అణుపరీక్ష శాంతియుతమైనదేనని, ఎవరినీ బెదిరించడానికి ఉద్దేశించింది కాదని భారత్ ఇచ్చిన వివరణనూ అప్పటి కెనడా ప్రధాని పిరె ట్రూడో పట్టించుకోలేదు.