Canada Diplomats India :భారత్లో పనిచేస్తున్న 41 మంది దైత్యవేత్తలను వెనక్కి రప్పించినట్లు అధికారికంగా ప్రకటించింది కెనడా. దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి మెలాని జోలి వెల్లడించారు. భారత్లో మొత్తం 62 మంది దౌత్యవేత్తలు ఉండగా.. వారిలోని 41 మందితో పాటు సిబ్బంది, కుటుంబ సభ్యులను వెనక్కి పిలిచినట్లు తెలిపారు. మిగిలిన 21 మంది కెనడా దౌత్యవేత్తలు భారత్లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
India Canada Diplomatic War : కెనడా దౌత్యవేత్తలకు రక్షణను ఏ క్షణమైనా తొలగిస్తామని భారత్ తెలిపిందని.. ఈ నేపథ్యంలో వారి భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు మంత్రి జోలి. ఇందుకోసమే వారి సిబ్బంది, కుటుంబాన్ని వెనక్కి పిలిచామని వివరించారు. ఇలా దౌత్యవేత్తల రక్షణను ఉపసంహరించుకోవడం అంతర్జాతీయ న్యాయ చట్టాలకు, ముఖ్యంగా జెనీవా ఒప్పందానికి పూర్తిగా విరుద్ధమని చెప్పారు. భారత్ చేసిన విధంగా కెనడా చేయబోదని తెలిపారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరు దేశాల్లోని పౌరులు ఇబ్బందులకు గురవుతారని పేర్కొన్నారు. భారత్‌లోని మూడు నగరాల్లో ఉన్న తమ దేశ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Canada Embassy In India :అయితే, దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్ గతంలోనూ కెనడాకు సూచించింది. ఇటీవల నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్ విదేశాంగ శాఖ.. దిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా దౌత్య సిబ్బంది సంఖ్య చాలా ఎక్కువగా ఉందని.. దాన్ని సమస్థాయికి తీసుకురావాలని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే దౌత్య సిబ్బందిని తగ్గించుకునేందుకు కెనడాకు అక్టోబరు 10వ తేదీ వరకు భారత ప్రభుత్వం డెడ్‌లైన్ విధించిందని వార్తలొచ్చాయి. అక్టోబరు 10లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని, ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్ హెచ్చరించినట్లు ఆ కథనం పేర్కొంది.