Canada Diplomatic Immunity :41 మంది కెనడా దౌత్యవేత్తలకు దౌత్యపరమైన రక్షణను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం.. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. కెనడా దౌత్యవేత్తలపై భారత్ అనుసరించిన వైఖరి రెండు దేశాల్లోని లక్షలాది మంది జీవితాల్ని దుర్భరం చేస్తుందని ట్రూడో వ్యాఖ్యానించారు. భారత్ నిర్ణయం దౌత్యం ప్రాథమిక సూత్రానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని బ్రాంప్టన్‌లో పేర్కొన్నారు. 62 మంది దౌత్య సిబ్బందిలో 41 మందిని ఉపసంహరించకపోతే వారికి అందించే దౌత్యపరమైన రక్షణను తొలిగిస్తామని భారత్ అంతకుముందు హెచ్చరించింది. దీంతో భారత్‌లోని తమ దౌత్య సిబ్బందిలో 41 మందిని వెనక్కు రప్పించుకున్నట్లు కెనడా అధికారికంగా ప్రకటించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి.
కెనడాకు దీటుగా బదులిచ్చిన భారత్
మరోవైపు భారత అల్టిమేటం అంతర్జాతీయ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కెనడా అక్కసు వెళ్లగక్కడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 11.1 నిబంధనలకు అనుగుణంగానే.. దౌత్యసిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపింది. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని.. దిల్లీ, ఒట్టావా దౌత్య సంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నామని చెప్పింది.
భారత్ నిర్ణయం ఆందోళకరం : అమెరికా
మరోవైపు భారత్ నిర్ణయంపై ఆందోళ వ్యక్తం చేసింది అగ్రరాజ్యం అమెరికా. కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని పట్టుపట్టకూడదని కోరింది. 1961 వియన్నా ఒప్పందాన్ని భారత్ అనుసరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న కెనడా దర్యాప్తుకు భారత్ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.