పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటెయినర్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వజీరాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు కంటెయినర్‌పైకి ఎక్కిన సందర్భంలో నిందితుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కుడి కాలికి గాయం కాగా.. పీటీఐ పార్టీకి చెందిన మరికొందరు నేతలకు గాయాలయ్యాయి. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నిందితుడు మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నందునే ఇమ్రాన్ ఖాన్‌ను చంపేందుకే తాను ఇక్కడికి వచ్చానని నిందితుడు వెల్లడించాడు. ఈ లాంగ్ మార్చ్ నేపథ్యంలో ఆయన ప్రజల్ని తప్పుదోవపట్టిస్తుంటే చూస్తూ భరించలేకపోతున్నానని.. అందుకే ఆయన్ను చంపేందుకు ప్రయత్నించినట్టు తెలిపాడు. ఇమ్రాన్ ఖాన్‌ను మాత్రమే తాను చంపాలనుకున్నానని.. ఇంకెవరినీ కాదన్నాడు. అందుకే ఇమ్రాన్ లాహోర్ దాటినప్పట్నుంచి ఆయన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వివరించాడు. అయితే, ఈ ఘటనలో ఇద్దరు కాల్పులు జరిపినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో నిందితుడు స్పందిస్తూ.. తాను ఒక్కడినేనని.. తనతో ఇంకెవరూ లేరని సమాధానం ఇచ్చాడు.