Bus Accident In Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు బోల్తా కొట్టడం వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది గాయపడ్డారు. బాగ్మతి ప్రావిన్స్‌లోని మకవాన్‌పుర్ వద్ద గురువారం జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కాఠ్మాండూ నుంచి బిర్‌గంజ్ వైపు వెళ్తున్న బస్సు మకవాన్‌పుర్ వద్ద అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మరో ఐదుగురు.. పశ్చిమ నేపాల్‌లోని క్యాంగసిబగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాఠ్మాండూ నుంచి రుకుమ్కోట్కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని రుకుంపుర్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.