తెలంగాణ

telangana

ETV Bharat / international

భర్త సమాధి వద్దే ఎలిజబెత్‌-2 ఖననం.. రాణి నివాళికి వేలాది మంది బ్రిటన్ పౌరులు - britian queen elizabeth funeral

బ్రిటన్‌ దివంగత రాణి ఎలిజబెత్‌-2 శవపేటికను ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ సమాధి చెంతనే ఖననం చేయనున్నారు. ఈ మేరకు బకింగ్‌హం ప్యాలెస్‌ గురువారం వెల్లడించింది. మరోవైపు, రాణికి తుది నివాళి అర్పించేందుకు బ్రిటన్‌ పౌరులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 16, 2022, 7:04 AM IST

బ్రిటన్‌ దివంగత రాణి ఎలిజబెత్‌-2 శవపేటికను ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ సమాధి చెంతనే ఖననం చేయనున్నారు. ఈ మేరకు బకింగ్‌హం ప్యాలెస్‌ గురువారం వెల్లడించింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబే వద్ద సాగే రాణి అంత్యక్రియల క్రతువు సోమవారం ఉదయం 11 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. చివరగా దేశవ్యాప్తంగా రెండు నిమిషాల మౌనం పాటించే కార్యక్రమంతో ముగుస్తుంది.

  • సోమవారం ఉదయం 8 గంటల నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబేలోకి 2000 మంది అతిథులను ఆసీనులయ్యేందుకు వీలుగా అనుమతిస్తారు. వీరిలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సహా 500 మంది ప్రపంచ నేతలుంటారు. ఇందుకోసం వారంతా బ్రిటన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రవాణా ఏర్పాట్లను వినియోగించుకుంటారు.
  • ఈ ఏడాది రాణి జన్మదిన పురస్కారాలు అందుకున్న సుమారు 200 మంది పౌరులు కూడా రాణి అంతిమ సంస్కారాల్లో పాల్గొంటారు.
  • సెయింట్‌ జార్జిస్‌ చాపెల్‌ వద్ద నిర్వహించే క్రతువు కోసం అబే నుంచి రాణి శవపేటికను విండ్సర్‌ కాజిల్‌కు చేరుస్తారు.
  • కింగ్‌ జార్జి-6 మెమోరియల్‌ చాపెల్‌ వద్ద కింగ్‌ ఛార్లెస్‌-3తో పాటు బ్రిటన్‌ రాజవంశానికి చెందిన ఇతర సీనియర్‌ సభ్యుల సమక్షంలో రాణి శవపేటికను గత ఏప్రిల్‌లో మరణించిన ప్రిన్స్‌ ఫిలిప్‌ సమాధి చెంతకు చేరుస్తారు.
  • ఎలిజబెత్‌-2 శవపేటికను సోమవారం ఉదయం 6.30 గంటల తరువాత రాయల్‌ నావికాదళం ఊరేగింపుగా అంత్యక్రియల ప్రదేశానికి తీసుకువస్తుంది. ఈ ప్రదర్శనలో కింగ్‌ ఛార్లెస్‌, ఆయన కుమారులు, యువరాజులు విలియం, హ్యారీలతో పాటు వెస్ట్‌మినిస్టర్‌ డీన్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌, కామన్వెల్త్‌ ప్రధాన కార్యదర్శి బరోనెస్‌ పాట్రిసియా స్కాట్‌లాండ్‌ పాల్గొంటారు. చివర్లో శవపేటిక వెంట కింగ్‌, క్వీన్‌, రాజవంశీయులు మాత్రమే ఉంటారు.
  • సాయంత్రం నాలుగు గంటలకు శవపేటికను రాయల్‌ వాల్ట్‌లో దించుతారు. అక్కడ విండ్సర్‌ డీన్‌ కీర్తన ఆలపిస్తారు. కాంటెర్‌బరీ ఆర్చిబిషప్‌ దీవెనలు, జాతీయగీతాలాపనతో అంత్యక్రియల కార్యక్రమం లాంఛనంగా పూర్తవుతుంది. అనంతరం 7.30 గంటలకు రాజవంశీయులకు మాత్రమే పరిమితమైన తుది అంత్యక్రియల ప్రక్రియ విండ్సర్‌ డీన్‌ ఆధ్వర్యంలో ముగుస్తుంది.
  • ఎలిజబెత్‌-2 అంత్యక్రియల నేపథ్యంలో ఏర్పడే రద్దీ దృష్ట్యా హీత్రూ విమానాశ్రయంలో సోమవారం సుమారు 100 విమాన సేవలను రద్దయ్యాయి.

రాణి నివాళికి తండోపతండాలు
రాణి ఎలిజబెత్‌-2కు తుది నివాళి అర్పించేందుకు బ్రిటన్‌ పౌరులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ హౌసెస్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో రాణి శవపేటికను సందర్శించేందుకు బుధవారం నుంచి ప్రజలకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవాసులు పోటెత్తడంతో లండన్‌ నగరంలో రద్దీ ఏర్పడింది. వేలాది మంది పౌరులు రాణి శవపేటికను దర్శించి తుది నివాళులర్పించేందుకు కిలోమీటర్ల కొద్ది ఏర్పడిన వరుసలో గంటల తరబడి నిలబడుతున్నారు. తమ వంతురాగానే బాధాతప్త హృదయాలతో శవపేటికలో ఉంచిన రాణి పార్థివదేహానికి నివాళులర్పించి వెనుతిరుగుతున్నారు. మరోపక్క ఇదే సమయంలో అక్కడ ఓ ఊహించని పరిణామం చోటుచేసుకొంది. రాణి శవపేటిక ఉంచిన వేదిక (కాటఫ్లాక్‌) వద్ద విధుల నిర్వహణలో ఉన్న ఓ గార్డ్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతడి ముఖం నేరుగా నేలకు తాకుతూ పడిపోగా.. పక్కనే ఉన్న పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. శవపేటిక వేదిక చుట్టూ భద్రతా దళాలు 24 గంటలు విధుల్లో ఉంటున్నాయి. ఆ క్రమంలో అక్కడి సైనికులు ఏకధాటిగా ఆరు గంటలపాటు నిలబడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఆ గార్డ్‌ అలసిపోయి స్పృహతప్పి పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details