తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్! దీపావళి రోజున గుడ్​న్యూస్​!! - తదుపరి బ్రిటన్ ప్రధానిగా లిజ్​ ట్రస్

Britian Next PM Rishi Sunak : బ్రిటన్‌ నూతన ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. పోటీ నుంచి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వైదొలగడం వల్ల రిషి సునాక్‌ విజయానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే సోమవారం రాత్రికల్లా సునాక్‌.. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ పదవి చేపట్టనున్న తొలి భారత సంతతి వ్యక్తిగా సునాక్‌ ఖ్యాతినార్జించనున్నారు.

britian next pm Rishi Sunak
రిషి సునాక్

By

Published : Oct 24, 2022, 11:54 AM IST

Britain Next PM Rishi Sunak :బ్రిటన్‌ నూతన ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపడతారనే ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కన్జర్వేటివ్‌ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పార్టీ ఐక్యత కోసం కన్జర్వేటివ్ నాయకత్వానికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. తన పునరాగమనానికి ఇది సరైన సమయం కాదన్నారు.

.

ఇలా కీలక వ్యక్తి పోటీ నుంచి వైదొలగడం, మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌కు ఎంపీల మెజారిటీ అంతంత మాత్రంగానే కనిపిస్తుండడం వల్ల బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ విజయానికి మార్గం సుగమమైనట్లేనని తెలుస్తోంది. నామినేషన్లకు సోమవారమే చివరి తేదీకాగా దీనిపై నేడు స్పష్టత రానుండడం సహా.. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే దీపావళి రోజునే భారత సంతతి వ్యక్తి బ్రిటన్‌ ప్రధాని అయ్యే అవకాశం కనిపిస్తోంది.

బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్‌ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇందులో భాగంగా తమకు పూర్తి మద్దతు ఉన్నట్లు బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2గంటలలోపే పోటీలో ఉన్న సభ్యులు వెల్లడించాల్సి ఉంది. రిషి సునాక్‌కు ఇప్పటికే 144 మంది ఎంపీల మద్దతు లభించింది. ఇప్పటివరకు 59 మంది ఎంపీల మద్దతు పొందిన బోరిస్‌ జాన్సన్‌ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇక రేసులో ఉన్న మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌కు ఇప్పటివరకు 23 మంది సభ్యుల మద్దతు మాత్రమే కూడగట్టారు. సునాక్‌తో పోటీపడాలంటే ఆమెకు మరో 75 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. నేడు తుదిగడువులోగా 100 ఎంపీల మద్దతు ఆమె సాధించలేకపోతే బ్రిటన్‌ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రమే రిషి సునాక్‌ను ప్రధానమంత్రిగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇద్దరు సభ్యులు పోటీలో ఉంటే మాత్రం.. లక్షా 70 వేల మంది టోరీ సభ్యుల మద్దతు ఎవరికో తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌ ఓటింగ్‌ నిర్వహిస్తారు. అందులో విజేతను శుక్రవారం ప్రకటిస్తారు.

రిషి సునాక్

ఇంతకు ముందు లిజ్‌ ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడ్డ రిషి సునాక్‌ ఎంపీల మద్దతు సాధించడంలో ముందంజలో ఉన్నప్పటికీ టోరీ సభ్యుల మనసులు గెలవలేకపోయారు. ఐతే తాను తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం వల్ల బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోపే లిజ్‌ ట్రస్‌ వైదొలిగారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన రిషి సునాక్‌ మరోసారి బ్రిటన్‌ ప్రధాని రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈసారి బ్రిటన్‌ ప్రధాని పదవి సునాక్‌కు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవీ చదవండి:'ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా'.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్​

షీ జిన్​పింగ్​ రికార్డ్.. మూడోసారి చైనా అధ్యక్షునిగా ఎన్నిక

ABOUT THE AUTHOR

...view details