తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్‌తో పీటముడిని విప్పేనా?.. 'స్వేచ్ఛా వాణిజ్యం'పై రిషి నిర్ణయమేంటో? - rishi sunak on free trade agreement

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌.. భారత్​తో ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్వేచ్ఛా వాణిజ్యంపై ఆయన ఎలా ముందుకెళ్తారనేది చూడాల్సి ఉంది.

rishi sunak
Britain primeminister rishi sunak

By

Published : Oct 26, 2022, 6:29 AM IST

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ ఎన్నిక కాగానే అందరి దృష్టీ ఆయన భారత మూలాలపై పడింది. భారత్‌లో మాత్రం ఆయన మన దేశంతో ఎలా వ్యవహరించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రెండు దేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌.టి.ఎ.) త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. ద్వైపాక్షిక సంబంధాలు కొంత స్తబ్దుగా మారాయి. మరి సునాక్‌ ఈ పీటముడినెలా విప్పుతారు? భారత్‌తో సంబంధాలనెలా చూస్తారనేది కీలకం. బోరిస్‌ జాన్సన్‌ హయాంలో భారత్‌-బ్రిటన్‌ల మధ్య ఎఫ్‌.టి.ఎ. ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు.

జనవరిలో మొదలైన చర్చలు ఈ అక్టోబరుకల్లా పూర్తవ్వాలి. కానీ... కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటం; లిజ్‌ట్రస్‌ కేబినెట్‌లో హోం మంత్రిగా పనిచేసిన మరో భారత సంతతి మంత్రి బ్రేవర్మన్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో అది పట్టాలు తప్పింది. వీసాలు పూర్తయినా చాలామంది భారతీయులు యూకేను వీడిపోవటం లేదంటూ... భారతీయ ఎంబసీని తప్పు పట్టేలా ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఘాటుగా స్పందించింది కూడా! ఆ ఒప్పందాన్ని ఇప్పుడు పట్టాలకెక్కించటం సునాక్‌ ముందున్న సవాలు. మరి ఆ పీటముడిని ఆయనెలా విప్పుతారనేది చూడాలి.

గతంలో భారత్‌పై వివిధ సందర్భాల్లో సునాక్‌ వ్యాఖ్యలు

  • భారత్‌-యూకే సంబంధాలిప్పుడు సమ ఉజ్జీల మధ్య భాగస్వామ్యంలాంటివి. ఇందులో ఎవరూ ఎక్కువ, తక్కువ కాదు.
  • ప్రపంచంలో బలమైన, సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థగా సంప్రదింపుల్లో పెత్తనం చెలాయించే సహజ హక్కు బ్రిటన్‌కిప్పుడు లేదు. ఆ హక్కును మనం సంపాదించుకోవాలి. భారత్‌లో ప్రస్తుతం 90 కోట్ల మంది 35 ఏళ్లలోపు వారున్నారు. వారంతా చాలా తెలివైనవారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటున్నవారు. వారిని బ్రిటన్‌ ఆకర్షించాలి.
  • రెండు దేశాల్లోని ప్రతిభావంతుల ఆదానప్రదానాలు జరగాలి. ప్రపంచస్థాయి ఆలోచనలు, ఆవిష్కరణలకు రెండు దేశాలు అవకాశాలు కల్పించుకోవాలి.
  • భారత్‌లో ఏం అమ్మవచ్చో, ఏం చేయొచ్చో అని మాత్రమే కాకుండా... భారత్‌ నుంచి బ్రిటన్‌ ఏం నేర్చుకోవచ్చో చూడాలి.
  • భారత్‌తో ఎఫ్‌.టి.ఎ.కు కట్టుబడి ఉన్నాం. ఇది రెండు దేశాలకూ ప్రయోజనకరం. ఉద్యోగాల కల్పనకూ ఇది దోహదం చేస్తుంది. భారత్‌లో బీమా లాంటి ఆర్థిక సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. విదేశీ కంపెనీలు తమ కంపెనీలతో కలసి పనిచేసేలా భారత్‌ ఇలాంటి రంగాన్ని మరింతగా సరళీకరించాలి.
  • బ్రిటన్‌ విద్యార్థులు భారత్‌కు వెళ్లి నేర్చుకునేలా, మన కంపెనీలు, భారతీయ కంపెనీలు కలసి నడిచేలా చేయాలనుకుంటున్నాను. రెండు దేశాల మధ్య బంధం పరస్పర సహకారంతో సాగాలని కోరుకుంటున్నాను.

మనకు అనుకూలంగానే..
భారతీయ మూలాలు ఉండటంతో భారత్‌పై సునాక్‌ చేసే వ్యాఖ్యలు, తీసుకునే ప్రతి నిర్ణయం నిశిత పరిశీలనకు లోనవటం ఖాయం. సునాక్‌ అక్కడి పార్లమెంటు ప్రసంగాల్లో భారత్‌తో బలమైన సంబంధాలపై పెద్దగా ఎన్నడూ మాట్లాడింది లేదు. రెండేళ్లకు పైగా బ్రిటన్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నా ఎన్నడూ భారత్‌లో అధికారికంగా పర్యటించలేదు. పలు సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నాయి.

ఒకప్పుడు బ్రిటిష్‌ వలస రాజ్యంగా ఉన్న భారతావనిని ఇప్పుడలా చూడటం కుదరదన్నది సునాక్‌ నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. భారత్‌ కోరుకుంటున్నది కూడా అదే. అయితే ఎఫ్‌.టి.ఎ.పై ఇప్పటికిప్పుడు అడుగులు ముందుకు పడే అవకాశాలు తక్కువే. ఎందుకంటే బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే సునాక్‌ ప్రాధాన్యం. అది పూర్తయ్యాకే ఎఫ్‌.టి.ఎ.పై ఆలోచించటానికి వీలవుతుందన్నది నిపుణుల మాట.

ఇదీ చదవండి:బ్రిటన్​ ప్రధాని భార్య అక్షతామూర్తికి 126 కోట్ల ఆదాయం.. ఈసారి పన్నులు చెల్లిస్తారా?

ఉప ప్రధానిగా డొమినిక్‌ రాబ్‌.. తిరిగి హోం సెక్రటరీగా బ్రేవర్మన్‌.. బ్రిటన్​ మంత్రివర్గ విస్తరణ

ABOUT THE AUTHOR

...view details