బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి విమర్శల్లో చిక్కుకున్నారు. లండన్ నుంచి లీడ్స్ నగరానికి రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానంలో ప్రయాణించడాన్ని పార్లమెంట్ సభ్యులు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశం తీవ్ర ద్రవ్యోల్బణంలో చిక్కుకున్న సమయంలో లీడ్స్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించడానికి ఆయన జెట్‌లో వెళ్లారు.
మరోసారి విమర్శల్లో సునాక్.. 'దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే.. ప్రైవేట్ జెట్‌లో ప్రయాణమా..?'
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరుస విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు జెట్‌లో ప్రయాణించడంపై తాజాగా ఆయనపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణంలో ఉన్నప్పుడు ఆయన ఇలా చేయడంపై పార్లమెంట్ సభ్యులు, పర్యావరణ వేత్తలు ఆయనపై మండిపడుతున్నారు.
'వైద్య సదుపాయాల కొరతతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతుంటే.. ప్రధాని మంత్రి మాత్రం లండన్ నుంచి లీడ్స్ వెళ్లేందుకు జెట్ ఉపయోగించారు' అని ప్రతిపక్ష లేబర్ పార్టీ మండిపడింది. ఇదొక దుబారా ఖర్చని విమర్శించింది. జీవన వ్యయాలు విపరీతంగా పెరిగిన తరుణంలో మూడు గంటల పర్యటన కోసం 36 నిమిషాల ప్రయాణంలో ప్రధాని ఎంత ఖర్చు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేసింది. ఆయన పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేయడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన ప్రతిజ్ఞలను అపహాస్యం చేశారని పలువురు ఎంపీలు, పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఈ విమర్శలపై ప్రధాని మంత్రి కార్యాలయం స్పందించింది. తన బిజీ షెడ్యూల్‌లో సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారని సమర్థించింది. తన షెడ్యూల్‌లో ఉన్న ఒత్తిడి కారణంగానే రైలు మార్గాన్ని కాకుండా విమానయానాన్ని ఎంచుకున్నారని తెలిపింది. ఇదివరకు కూడా ఈ తరహా విమర్శలే వచ్చాయి. టోరీ నేతలు ఇచ్చిన విందుకు హాజరయ్యేందుకు లండన్‌లోని బాటర్‌సీ నుంచి వేల్స్ వెళ్లేందుకు సునాక్ పదివేల పౌండ్లపైనే వ్యక్తిగత సొమ్మును వెచ్చించారని వాటి సారాంశం.