Britain Cabinet Reshuffle : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. అందులో భాగంగా ఆ దేశ హోం మంత్రి, భారత సంతతి నాయకురాలు సుయెల్లా బ్రేవర్మన్(43)కు ఉద్వాసన పలికారు. కొత్త హోం మంత్రిగా జేమ్స్ క్లెవర్లీని నియమించారు. మరోవైపు, విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్‌ను నియమిస్తూ అరుదైన నిర్ణయం తీసుకున్నారు.
సుయెల్లా బ్రేవర్మన్ ఉద్వాసనకు కారణమిదే!
Britain Home Minister News Today :గత నెలలో ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత.. బ్రిటన్‌లో పాలస్తీనా మద్దతుదారులు పెద్దఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ర్యాలీల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లుగా కొద్దిరోజుల క్రితం సుయెల్లా బ్రేవర్మన్ ఆరోపించారు. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో లండన్‌లో గత నెలలో జరిగిన భారీ నిరసన ర్యాలీని సుయెల్లా ఖండించారు. ఆ ర్యాలీని 'విద్వేష కవాతు'గా అభివర్ణించారు. పోలీసుల తీరుపై సుయెల్లా వైఖరికి సంబంధించిన వ్యాసాలను ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది. అప్పటి నుంచి ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని సునాక్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం.. ఆమెకు సునాక్ ఉద్వాసన పలికినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
బ్రిటన్ కేబినెట్‌లో సుయెల్లా బ్రేవర్మన్ సీనియర్ మంత్రి. గతంలో మాజీ ప్రధాని లిజ్ ట్రస్ మంత్రివర్గంలో కూడా ఆమె పనిచేశారు. అప్పట్లో లిజ్ ట్రస్ ప్రభుత్వం గందరగోళ సమయాన్ని ఎదుర్కొంటోందని విమర్శలు చేశారు. అదే సమయంలో వలసల అంశంపై అధికారిక పత్రాలకు సంబంధించి నిబంధనలను ఉల్లఘించినందుకు బాధ్యత వహిస్తూ.. ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. ఆమెకు మద్దతుగా నిలిచి మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం వల్ల మరోసారి పదవి కోల్పోయారు.