Queen Elizabeth Funeral : బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణంతో బ్రిటన్ సహా కామన్‌వెల్త్ దేశాల్లో జాతీయ జెండాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. రాణి ఎలిజబెత్ మరణించిన కొన్ని నిమిషాల్లోనే చైనాలోని షాంఘైలో తమ పరిశ్రమకు భారీ ఎత్తున జెండాలను తయారు చేయాలంటూ ఆర్డర్లు వచ్చాయని కంపెనీ మేనేజర్ ఫాన్ ఐపింగ్ వివరించారు. అదే రాత్రి జెండాలను ప్రింట్ చేయడం మొదలు పెట్టామని తెల్లారే సరికి అవి అమ్ముడయ్యాయని ఆమె వివరించారు.
రాణి మరణించిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు 5లక్షలకు పైగా యూకే జాతీయ జెండాలను తయారు చేసినట్లు ఐఫింగ్ వెల్లడించారు. వందకు పైగా కార్మికులు ఉన్న ఆ కార్మాగారంలో 9రోజుల నుంచి యూకే జెండాలను తయారు చేయడం తప్ప మరే పనులు చేయడం లేదని తెలిపిన ఆమె కంపెనీలోని కార్మికులకు తీరిక లేనంత పని దొరికిందన్నారు.
బ్రిటన్ రాణి మరణించి 9రోజులైనా.. ఇంకా ఆర్డర్ల వరద కొనసాగుతోందని షాంగ్‌డాంగ్ టూర్ ఆర్టికల్స్ కంపెనీ మేనేజర్ తెలిపారు. ముందుగా ఇచ్చిన ఆర్డర్లను పూర్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కొద్ది రోజులుగా తయారు చేస్తున్న పతాకాలు పూర్తిగా ప్యాకింగ్ కూడా చేయకముందే వినియోగదారులు తీసుకుపోతున్నట్లు ఆమె వివరించారు. యూకే పతాకాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కార్మాగారంలో పని వేళలను కూడా సవరించారు. కార్మికులు పని వేళలకు ఇబ్బంది పడకుండా పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.