BRICS Membership Expansion :బ్రిక్స్ కూటమి దేశాధినేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిక్స్ కూటమిలో మరో ఆరు కొత్త సభ్య దేశాలను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బ్రిక్స్ కూటమిలో చోటు దక్కనుంది. కొత్త సభ్య దేశాలు 2024 జనవరి 1 నుంచి బ్రిక్స్ కూటమిలో భాగమవుతాయని బిక్స్ దేశాధినేతలు ప్రకటించారు.
BRICS Countries Expansion :భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా బ్రిక్స్ కూటమి విస్తరణ నిర్ణయాన్ని ప్రకటించారు. 'బ్రిక్స్ కూటమిలో కొత్తగా 6 సభ్య దేశాలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భాగమవుతాయి. విస్తరణ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు, ప్రమాణాలు, విధివిధానాలపై ప్రస్తుత బ్రిక్స్ కూటమి దేశాలు చర్చించుకున్నాయి. ఆ తర్వాతే కొత్త సభ్య దేశాలను బ్రిక్స్ కూటమిలో భాగం చేసేందుకు అంగీకరించాం. బ్రిక్స్ విస్తరణ ప్రక్రియలో అందరం ఏకాభిప్రాయంతో ఉన్నాం. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్‌ను దింపిన భారత్‌కు అభినందనలు.' అని రమఫోసా తెలిపారు.
సభ్య దేశాల రాకతో కూటమికి కొత్త శక్తి..
BRICS Modi Speech : బ్రిక్స్‌లో ఆరు కొత్త దేశాలను చేర్చుకోవడం వల్ల కూటమికి కొత్త శక్తి వచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బ్రిక్స్ కూటమి విస్తరణ, ఆధునీకరణ.. అంతర్జాతీయ సంస్థలన్నీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల మూడురోజుల సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు బ్రిక్స్ కూటమిలో మరో 6 సభ్య దేశాలను చేర్చుకోనున్నట్లు చెప్పారు.
"బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఆరు కొత్త సభ్య దేశాల చేరిక బ్రిక్స్ కూటమిని మరింత బలోపేతం చేస్తుంది. మూడు రోజుల చర్చల అనంతరం బ్రిక్స్ కూటమిలో కొత్త సభ్య దేశాలను చేర్చుకోవాలని నిర్ణయించాం. కొత్త సభ్య దేశాలైన అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈకి.. భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రయాన్-3 సక్సెస్.. ప్రపంచ మానవాళి సాధించిన విజయం. భారత్, శాస్త్రవేత్తల తరఫున ప్రపంచ శాస్త్రీయ సమాజానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను."