Brazil President Leonardo: ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ అంశాలపై తరచూ స్పందించే హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోకు ఓ దేశాధ్యక్షుడి నుంచి కౌంటర్ ఎదురయ్యింది. అమెజాన్ అడవుల్లో పర్యావరణ ప్రాముఖ్యతపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా అనవసర మాటలు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండాలని హాలీవుడ్ నటుడు లియోనార్డోను డికాప్రియోకు సూచించారు.
'అమెజాన్‌కు బ్రెజిల్ పుట్టినిల్లు. వాతావరణ మార్పులతోపాటు ఇతర పర్యావరణ వ్యవస్థలకు బ్రెజిల్ నిలయం. అక్కడ ఏం జరుగుతుందో అనే విషయం మనందరికి ఎంతో ముఖ్యమైనది. అమెజాన్ అడవులు క్షీణించిపోతోన్న తరుణంలో వాటి పరిరక్షణకు ఉపక్రమించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలి. మన గ్రహాన్ని సురక్షితంగా ఉంచుకోవడంలో భాగంగా జరిగే మార్పునకు యువత ఓటింగ్ ఎంతో కీలకం. వచ్చే ఎన్నికల్లో యువత భారీ సంఖ్యలో రిజిస్టర్ చేసుకొని పోలింగ్‌లో పాల్గొనాలి' అంటూ బ్రెజిల్ యువతను ఉద్దేశిస్తూ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ఇటీవల ట్వీట్ చేశారు.
లియోనార్డో ట్వీట్‌కు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తాజాగా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని లియోనార్డో సూచించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బ్రెజిల్ వ్యవసాయ వాణిజ్యం లేకుంటే ప్రపంచం ఆకలితో అలమటిస్తుందని ప్రపంచ వాణిజ్య సంస్థ ఉపాధ్యక్షుడు చెప్పిన మాటలను గుర్తుచేశారు. అందుకే పిచ్చి మాటలు మాట్లాడే బదులు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదంటూ లియోనార్డోకు సూచించారు. అమెజాన్‌లో కార్చిచ్చును ప్రస్తావిస్తూ 2019లో లియోనార్డో చేసిన పోస్టు కూడా సరైంది కాదని.. అది 2003లో జరిగిన ఘటన అంటూ హాలీవుడ్ నటుడిపై జైర్ బోల్సోనారో విమర్శలు గుప్పించారు.
ఇదిలాఉంటే, 2019లో జైర్ బోల్సోనారో అధ్యక్ష పదవి చేపట్టిన నుంచి అమెజాన్ అడవుల్లో విధ్వంసం మరింత పెరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, అమెజాన్ ప్రాంతంలో చేపడుతోన్న చర్యలు ఆ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు అడ్డుపడుతున్నాయని బోల్సోనారో వాదన. అందుకే ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ చర్యలను ఆయన బలహీనపరుస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తోన్న టైటానిక్ హీరో లియోనార్డో.. అమెజాన్ అడవుల్లో కార్చిచ్చులను అరికట్టేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో తమ ఓటుహక్కు ద్వారా యువత మార్పునకు శ్రీకారం చుట్టాలంటూ చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ అధ్యక్షుడు ఈవిధంగా స్పందించారు. ఈ ఏడాది చివరలో బ్రెజిల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి.
ఇదీ చదవండి:ఉక్రెయిన్‌లో బైడెన్, ట్రూడో.. అనూహ్య పర్యటనతో రష్యా షాక్!