Brazil Building Collapse : బ్రెజిల్లో ఓ పాత భవనం కూలి ఆరుగురు చిన్నారులు సహా 14 మంది మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా నిరాశ్రయులుగా తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రం పెర్నాంబుకోలో ఈ ఘటన జరిగింది. పాలిస్టా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. 1970లో భవనం నిర్మాణం జరిగిందని.. శిథిలావస్థకు చేరడం వల్ల 2010 నుంచే ఈ భవనంపై నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయని వారు వెల్లడించారు. ఇళ్లులేని కుటుంబాలు ఈ భవనాన్ని ఆక్రమించుకున్నాయని అధికారులు వివరించారు. నిషేదాజ్ఞలు లెక్కచేయకుండా.. బాధిత కుటుంబాలు అక్రమంగా ఇందులో నివాసం ఉంటున్నాయని పేర్కొన్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయని అధికారులు వివరించారు. అనంతరం హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారని వారు పేర్కొన్నారు. పోలీసు జాగిలాల సాయంతో శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. "శిథిలాల్లో చిక్కుకున్న 15 ఏళ్ల చిన్నారిని, 65 ఏళ్ల వృద్ధురాలిని ప్రాణాలతో కాపాడాం. ఓ 18 ఏళ్లు యువకుడిని కూడా రక్షించినప్పటికీ.. అతడు చికిత్స పొందుతూ మరణించాడు. మనుషులను కాపాడిన అనంతరం శిథిలాల్లో చిక్కుకున్న జంతువును రక్షించేందుకు దృష్టి సారించాం." అని అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే పాలిస్టాలో జరిగింది. ఓ భవనం కూలి దాదాపు ఐదుగురు మృతి చెందారు.