సముద్రంలో పడవ మునక.. 29 మంది వలసదారులు మృతి - ఇటలీ పడవ ప్రమాదం
21:51 March 26
సముద్రంలో పడవ మునక.. 29 మంది వలసదారులు మృతి
టునీషియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగం వల్ల 29 మంది వలసదారులు మరణించారు. మరో 67 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 19 మృతదేహాలను స్వాధీనం చేసినట్లు షనల్ గార్డ్ ప్రతినిధి హౌసమెద్దీన్ జెబాబ్లీ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 11 మందిని రక్షించినట్లు వారు తెలిపారు. మునిగిపోయిన పడవల్లో ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయం వెంటనే తెలియరాలేదు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. వీరంతా ఆఫ్రికాకు చెందిన వారిగా అధికారులు భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం మధ్యధరా సముద్రం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గం అని తెలిపింది. అయితే మధ్యధర సముద్రాన్ని దాటి ఐరోపా దేశాలకు చేరేందుకు వలసదారులను స్మగ్లర్లు చిన్న పడవల్లో తరలిస్తుంటారు. దాంతో వారు సముద్రం దాటుతుండగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వందలాది మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోతుంటారు.
ఇటలీలో నీట మునిగిన పడవ..
ఇటీవలే ఇటలీలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అయోనియన్ సముద్ర తీరంలో శరణార్థుల పడవ ప్రమాదానికి గురై 59 మంది మృతి చెందారు. ఘటనా సమయంలో బోటులో 100 మందికిపైగా వలసదారులు ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. మిగిలిన వారు ప్రాణాలతో సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో నెలలు నిండని శిశువు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కోస్ట్ గార్డ్ సిబ్బందితోపాటు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పడవలోని శరణార్థులు తుర్కియే, ఈజిప్టుల నుంచి వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఫిబ్రవరి 27 జరిగిందీ ప్రమాదం.