Bahamas boat accident: హైతీ వలసదారులతో ప్రయాణిస్తున్న బోటు బహమాస్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 17మంది మరణించారు. సముద్రం నుంచి బహమియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. బోటులో ఉన్న 25 మందిని రక్షించినట్లు బహమాస్ అధికారులు తెలిపారు. న్యూ ప్రొవిడెన్స్ నుంచి ఏడు మైళ్ల దూరంలో ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. మృతుల్లో 15 మంది మహిళలు, ఒక పురుషుడు, ఒక శిశువు ఉన్నారని పేర్కొన్నారు. బోటు ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి అధికారులు తరలించారు.
''ట్విన్-ఇంజిన్ స్పీడ్ బోట్ బహమాస్ నుంచి 60 మంది వలసదారులతో బయలుదేరి ప్రమాదానికి గురైంది. వలసదారులను అక్రమంగా తరలిస్తున్న వారిపై దర్యాప్తు చేస్తాం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నా.''
-ఫిలిప్ బ్రేవ్, బహమాస్ ప్రధాన మంత్రి