Boat Accident In Nigeria Today : ఆఫ్రికా దేశం నైజీరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో 100 మంది వరకు ప్రయాణికులు గల్లంతయ్యారు. నైజర్ నదిలో ప్రయాణిస్తుండగా పడవ ఓవర్ లోడ్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటన మంగళవారం నార్త్-సెంట్రల్ నైజీరియాలో జరిగింది.
"నైజర్ రాష్ట్రంలోని బోర్గు జిల్లా నుంచి పొరుగున ఉన్న కెబ్బి రాష్ట్రంలోని ఓ మార్కెట్‌కు సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులను తీసుకువెళ్తుండగా నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 100 మంది ప్రయాణికుల ఆచూకీ తెలియాల్సి ఉంది. పడవ ఓవర్లోడ్తో పాటు బలమైన గాలులు ప్రమాదానికి గల ప్రధాన కారణాలుగా భావిస్తున్నాము."
- ఇబ్రహీం ఔడు, నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి
'అధిక శాతం మహిళలే'
పడవ కేవలం 100 మందిని మోసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, అంతకుమించి ప్రయాణికులతో పాటు పెద్ద మొత్తంలో ధాన్యం బస్తాలను కూడా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పడవ నడిపే వ్యక్తులు దానిని నియంత్రించలేకపోయారని చెప్పారు. ఫలితంగా పడవ నీట మునిగినట్లు తెలిపారు. తప్పిపోయిన ప్రయాణికుల ఆచూకీ కోసం ఎమర్జెన్సీ విభాగం అధికారులు- గ్రామస్థులు, స్థానిక డైవర్ల సాయం తీసుకుంటున్నారని ఇబ్రహీం ఔడు తెలిపారు. గల్లంతయిన వారిలో అధిక శాతం మహిళలే ఉన్నారని, వీరిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడతారో ఇప్పుడే చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.