'నిద్ర పోయేవాణ్ని లేపచ్చు.. కానీ నిద్ర నటించే వాడిని లేపడం చాలా కష్టం' అని అంటుంటారు. అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఓ మహిళ అంధురాలిగా నటిస్తూ.. దాదాపు 15 ఏళ్లుగా దివ్యాంగుల కేటగిరీలో ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటోంది. 15 సంవత్సరాలు ఆమెను ఎవరూ పట్టుకోలేదు. తనకు తానుగా ఎవరికీ దొరలేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు నటించేవాళ్లు అంత సులభంగా దొరకరు కదా. కానీ, ఈ మహిళ చివరకు తన పొరపాటు వల్లే.. అధికారులకు చిక్కి కటకటాలపాలైంది. ఇంతకీ ఆ మహిళ ఎలా దొరికిందంటే!
ఇటలీకి చెందిన 48 ఏళ్ల వయుసున్న ఓ మహిళ.. తనను తాను ఓ అంధురాలిగా ప్రకటించుకుంది. వైద్యులు, ప్రభుత్వ అధికారులను నమ్మించి.. ఎలాగోలా అంధురాలిననే ధ్రువీకరణ పత్రం పొందింది. ఇంకేముంది.. ప్రజల్లో అంధురాలు అనే జాలి కలిగేలా చేసుకుంది. దాంతో పాటు.. ఇటలీ ప్రభుత్వ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ సెక్యూరిటీ సంస్థ నుంచి పింఛన్ వచ్చేలా చేసుకుంది. అలా.. 15 సంవత్సరాలు ద్విపాత్రాభినయం చేస్తూ.. ఎవరికీ అనుమానం రాకుండా కాలం వెళ్లదీసింది. అలా 15 ఏళ్లలో ప్రభుత్వం నుంచి 2,08,000 యూరోలు.. (భారత కరెన్సీలో రూ. 1.8 కోట్లు) పింఛన్ రూపంలో కొల్లగొట్టింది.