అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో శ్వేతసౌధంలో కోలాహలంగా వేడుకలు నిర్వహించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ పాల్గొన్నారు. ప్రపంచంలోని భారతీయులందరకీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బైడెన్.. మనలో చీకటిని పారదోలి.. వెలుగు ఇచ్చే శక్తి పండుగలకు ఉందన్నారు. 'అమెరికా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. దీపావళి వేడుకలను అమెరికా సంస్కృతిలో భాగం చేసిన ఆసియా-అమెరికా ప్రజలకు ధన్యవాదాలు. శ్వేతసౌధంలో ఈ స్థాయిలో దీపావళి వేడుకలు జరగడం ఇదే ప్రథమం' అని బైడెన్ పేర్కొన్నారు.
అమెరికాలో అట్టహాసంగా దీపావళి వేడుకలు.. వారికి బైడెన్, కమల ధన్యవాదాలు - జో బైడెన్ కమలా హారిస్
అమెరికాలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్వేతసౌధంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు హాజరైన అధ్యక్షుడు జో బైడెన్.. మనలో చీకటిని పారదోలి వెలుగు ఇచ్చే శక్తి పండుగలకు ఉందని ఉద్ఘాటించారు. దీపావళి అమెరికా సంస్కృతిలో భాగంగా మారిందన్న కమలా హారిస్... అందుకు ప్రవాస భారతీయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దీపావళి అమెరికా సంస్కృతిలో భాగంగా మారిందన్న కమలా హారిస్... అందుకు ప్రవాస భారతీయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వంద కోట్ల మందికి పైగా ఈ పండుగ జరుపుకొంటున్నారని ఆమె గుర్తు చేశారు. 'ప్రతిఒక్కరిలో వెలుగును చూడాలని దీపావళి మనకు గుర్తుచేస్తుంటుంది. చీకట్లో వెలుగులు నింపాలని, విభజన, విద్వేష శక్తులకు వ్యతిరేకంగా శాంతి-న్యాయం కోసం పోరాడాలని ఈ పండుగ మనకు స్ఫూర్తినిస్తుంది' అని కమలా హారిస్ పేర్కొన్నారు.
మరోవైపు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఫ్లోరిడా రాష్ట్రంలోని తన స్వగృహం 'మార్ ఏ లాగో'లో పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ట్రంప్ ప్రారంభించారు. అనాదిగా చెడుపై మంచి విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌభ్రాతృత్వంతో మెలగాలని ట్రంప్ ఆకాంక్షించారు. భారతీయులు, హిందూ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు ఎంతో గౌరవముందని ఉద్ఘాటించారు.