అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన పాత కార్యాలయంలో అత్యంత రహస్య పత్రాలు బయట పడటం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఎన్నికల్లో లబ్ధికోసం ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టినట్లుగా అనుమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు బైడెన్‌పై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే అంశం అటార్నీజనరల్ పరిశీలనలో ఉంది.
బైడెన్ పాత కార్యాలయంలో ఉక్రెయిన్, ఇరాన్, యూకేకు సంబంధించిన సున్నితమైన అంశాలకు చెందిన ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ దేశంలోని కీలక వ్యక్తులకు ఇంటెలిజెన్స్ సంస్థలు అందించే సంక్షిప్త సారాంశాలుగా తెలుస్తోంది. ఇవి 2013-16 మధ్యలో సేకరించిన ఇంటెలిజెన్స్‌కు సంబంధించినవి. ఆ కార్యాలయంలో మరో మూడు నాలుగు బాక్సుల రహస్య పత్రాలు ఉన్నట్లు ఆంగ్ల పత్రిక సీఎన్‌ఎన్ కథనం వెలువరించింది. ఇవన్నీ'ది ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్' పరిధిలోకి వచ్చేవి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కార్యాలయంలో బైడెన్ కుటుంబ పత్రాలు కూడా దొరికాయి. వీటిల్లో బ్యూ బైడెన్‌కు చెందిన అంత్యక్రియల ఏర్పాట్ల పత్రాలు, సంతాప సందేశాల లేఖలు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఎన్నికల ముందు తొక్కిపట్టి..!
వాస్తవానికి బైడెన్ పాత కార్యాలయంలో పత్రాలు 2022 నవంబర్ 2వ తేదీనే వెలుగు చూశాయి. అప్పట్లో ఆ కార్యాలయం మూసివేసేందుకు బైడెన్ లాయర్ వెళ్లారు. ఆయనకు అక్కడ ఓ మనీలా ఫోల్డర్ కనిపించింది. దానిపై 'పర్సనల్' అనే లేబుల్ ఉంది. దానిలో 'రహస్య పత్రాలు' అని రాసి ఉన్న కవర్‌ను ఆయన గుర్తించారు. వెంటనే జాతీయ ఆర్కైవ్స్ విభాగానికి ఫోన్ చేశారు. ఆ తర్వాత బైడెన్ బృందం పలు బాక్సులను ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి తొలగించింది. అప్పటికి మరో ఆరు రోజుల్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. కానీ, ఈ వ్యవహారం వెంటనే బయటకు రానీయలేదు. ఎన్నికలు ముగిసి.. ప్రతినిధుల సభ స్పీకర్ ఎంపిక కూడా పూర్తయ్యాక ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు హోరాహోరీగా తలపడ్డారు. రిపబ్లికన్లకు స్వల్ప మెజార్టీ మాత్రమే లభించింది. దీంతో సభాపతి ఎన్నిక కోసం కూడా ఆ పార్టీ తంటాలు పడింది. అదే మధ్యంతర ఎన్నికలకు ముందు ఈ పత్రాల వ్యవహారం వెలుగులోకి వస్తే డెమోక్రాట్లు తీవ్రంగా దెబ్బతినేవారు.