ఆర్థిక, వ్యాపార రంగంలో కలిసి పనిచేసే దిశగా భారత్, అమెరికా సహా 12 దేశాల మధ్య ఇండో-పసిఫిక్ ఒప్పందం కార్యరూపం దాల్చింది. జపాన్‌లోని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఒప్పందాన్ని ప్రారంభించారు.ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆర్థికంగా బలోపేతం అవడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ ఒప్పందంలో క్వాడ్ దేశాలతో పాటు బ్రూనయ్, దక్షిణ కొరియా, ఇండోనేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, వియత్నాం, థాయ్లాండ్, మలేసియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ప్రపంచంలోని 40 శాతం జీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిస్థితులు ప్రభావం చూపించిన నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని సభ్య దేశాలు పేర్కొన్నాయి.
"సరఫరా గొలుసుల విస్తరణ, డిజిటల్ వర్తకం, శుద్ధ ఇందనం, అవినీతి రహిత ప్రయత్నాలు సహా ఆసియా ఆర్థిక వ్యవస్థలతో అమెరికా మరింత సన్నిహితంగా పని చేసేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం ఉందన్న మాట నిజం. కానీ ఇతర దేశాలతో పోలిస్తే అంత తీవ్రంగా లేదు. ఈ ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనా కంటే వేగంగా పుంజుకుంటుంది. "
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు