US-China Tech War: ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుకొని గూఢచర్యం చేయడంలో చైనాది అందెవేసిన చేయి. అలాంటి చైనానే ఇప్పుడు విదేశీ ఎలక్ట్రానిక్ పరికరాలు, సాఫ్ట్‌వేర్లు వాడటానికి భయపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీల్లో ఉన్న కోట్లాది కంప్యూటర్లను పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. రెండేళ్లలోపు స్థానిక ప్రత్యామ్నాయాలతో వీటిని భర్తీ చేయాలని సూచించింది. కీలక విభాగాల్లో విదేశీ టెక్నాలజీల వినియోగాన్ని పూర్తిగా తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇక చైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కనీసం 5 కోట్ల కంప్యూటర్లను మాత్రం కచ్చితంగా తొలగించాల్సి ఉంది. మరో రెండేళ్లలో ప్రావిన్స్‌ల్లోని ప్రభుత్వాలు కూడా దీనిని అమలు చేసేలా చర్యలు తీసుకోవచ్చు. అమెరికాపై ఆధారపడితే ఆంక్షల రూపంలో ఎప్పుడైనా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొంది.
చైనా దాదాపు పదేళ్ల నుంచి విదేశీ టెక్నాలజీల వినియోగాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకొంది. ప్రభుత్వ అధికారిక కొనుగోళ్ల జాబితాలో ఉంటే వాటిని తొలగించేందుకు మొగ్గుచూపేది. ఈ నేపథ్యంలో హెచ్‌పీ, మైక్రోసాఫ్ట్ సంస్థలు చైనా ప్రభుత్వ మద్దతున్న సంస్థలతో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి ఆర్డర్లను కాపాడుకొన్నాయి. కానీ, తాజా నిర్ణయంతో ఇప్పుడు అది వేగవంతమైంది. ముఖ్యంగా భౌగోళిక రాజకీయాల్లో ప్రధాన ప్రత్యర్థి అయిన అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని పేర్కొంది.
లెనోవాకు జాక్‌పాట్..!:సెమీకండెక్టర్లు, సర్వర్లు, ఫోన్లు వంటి వాటిల్లో చైనా ఇప్పటికీ అమెరికాపై ఆధారపడుతోంది. చైనా నిర్ణయంతో హెచ్‌పీ, డెల్ వంటి సంస్థలపై ప్రభావం చూపనుంది. చైనా సంస్థ లెనోవాకు ఇది కలిసొచ్చే నిర్ణయం. ఈ విషయం బయటకు వచ్చాక శుక్రవారం హాంకాంగ్ మార్కెట్లో లెనోవా షేర్లు 5శాతం పెరిగాయి. బీజింగ్ నుంచి లెనోవాకు భారీగా ఆర్డర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చిప్‌ల కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు మొత్తం 15రకాల చిప్‌డిజైన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది.
మరోపక్క దేశీయంగా హార్డ్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి లెనోవా, హువావే, ఇన్‌స్పర్ లిమిటెడ్‌లు పనిచేస్తున్నాయి. వీటికితోడు మైక్రోసాఫ్ట్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి కింగ్‌సాఫ్ట్, స్టాండర్డ్ సాఫ్ట్‌వేర్ వంటి సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
2016లోనే కమిటీ ఏర్పాటు..:అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనా 2016లో ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ ఇన్నోవేషన్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. పరిశ్రమ ప్రమాణాలు నిర్దేశించడానికి, వృత్తి నిపుణులకు శిక్షణకు, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. వందల కొద్దీ పీసీ, చిప్స్, నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్ సరఫరాదారులతో కలిసి ఇది పనిచేస్తోంది.