తెలంగాణ

telangana

ETV Bharat / international

Bed Bugs In France : ఫ్రాన్స్​లో నల్లుల బెడద.. మెట్రోలో నిల్చొనే ప్రయాణం.. సినిమా హాళ్లు, రైళ్లు, హోటళ్లలోనూ..

Bed Bugs In France : పర్యటక స్వర్గధామం, వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు వేదికైన ఫ్రాన్స్‌ను నల్లుల బెడద వేధిస్తోంది. ముఖ్యంగా ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో ప్రజలు నల్లుల కారణంగా నరకం చూస్తున్నారు. సినిమాహాళ్లు, హోటళ్లు, బస్సులు, రైళ్లు, సబ్‌వేలు.. ఇలా ఎక్కడ చూసినా నల్లులే దర్శనమిస్తున్నాయి. ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఈ నల్లుల నివారణకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే.. వచ్చే ఏడాది పారిస్‌ వేదికగా ఒలింపిక్స్ జరగనున్న వేళ ఆరోగ్యం, భద్రత తదితర అంశాలపై ఈ నల్లుల బెడద పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.

Bed Bugs In France
Bed Bugs In France

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 3:32 PM IST

Bed Bugs In France :ప్రపంచంలో ప్రముఖ పర్యటక దేశం, వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనున్న ఫ్రాన్స్‌ను నల్లులు పట్టిపీడిస్తున్నాయి. నల్లుల బెడదతో పర్యాటక స్వర్గధామం సతమతమవుతోంది. ముఖ్యంగా ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో నల్లుల సమస్య తీవ్రంగా ఉంది. రైళ్లు, బస్సులు, సినిమా హాళ్లు, హోటళ్లు, సబ్‌వేలు ఇలా నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా నల్లులే కనిపిస్తున్నాయి. ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాయి. కొందరిలో తీవ్రమైన అలర్జీలకు కారణమవుతున్నాయి. నల్లులకు సంబంధించిన భయానక వీడియోలు, కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా హాళ్లకు ప్రజలు రావడం తగ్గిపోతుండటంపై యజమానులు ఆందోళన చెందుతున్నారు. థియేటర్లలోని సీట్లపై గుర్తు తెలియని పురుగులు ఉన్నట్లు వీడియోలు వ్యాప్తి చెందడం హాళ్ల యజమానుల్లో భయాన్ని మరింత పెంచింది. మెట్రో రైళ్లలో కూడా ప్రజలు కూర్చోవడానికి బదులుగా నిల్చొని ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారు.

నల్లుల విషయంలో నగరంలో ఎవరూ సురక్షితంగా లేరని పారిస్‌ ఉపమేయర్‌ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వచ్చే ఏడాది ఒలింపిక్‌ క్రీడల నిర్వహణకు పారిస్‌ సిద్ధమవుతోన్న నేపథ్యంలో.. ఈ పరిణామాలపై ఫ్రాన్స్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లుల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. రోజూ 36 లక్షల మంది ప్రజలు పారిస్‌కు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ క్రమంలోనే నల్లుల ఉద్ధృతి పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. మూడేళ్ల క్రితమే ఫ్రాన్స్‌ ప్రభుత్వం నల్లులపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌, అత్యవసర నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. అనేక ప్రణాళికలు అమలు చేసింది. అయితే, కీటక నాశనిలను సైతం ఇవి తట్టుకుంటుండటంతో నల్లుల బెడద తీవ్రంగా మారినట్లు సంబంధిత నిపుణులు వెల్లడించారు. ఈ సమస్యతో ఒలింపిక్ క్రీడలకు ఎటువంటి ముప్పు లేదని పారిస్‌ ఉప మేయర్‌ గ్రెగోయిర్ చెప్పారు. నల్లులు ఇంతకు ముందు ఉన్నాయి. తర్వాత కూడా ఉంటాయి. అయితే, వాటి నివారణకు అందరూ కలిసి పనిచేయడానికి ఒలింపిక్స్‌ ఒక అవకాశం అని ఆయన తెలిపారు.

ఫ్రాన్స్​లో నల్లుల కట్టడికి చర్యలు

ఈ నల్లుల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిసబెత్‌ బోర్న్‌ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. రవాణా మంత్రి క్లెమెంట్ బౌన్ రవాణా సంస్థలతో సమావేశమయ్యారు, తనిఖీలు, క్రిమిసంహారక కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. 2017 నుంచి 2022 మధ్యలో ఫ్రాన్స్‌లోని ప్రతి 10 ఇళ్లలో ఒక ఇళ్లు నల్లుల బారినపడింది. నల్లుల సంఖ్య పెరగడానికి గ్లోబర్‌ వార్మింగే కారణమని ఫ్రాన్స్‌ ప్రభుత్వం చెబుతోంది.

ఫ్రాన్స్​లో నల్లుల కట్టడికి చర్యలు

వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఆరోగ్యం, భద్రత తదితర అంశాలపై ఈ నల్లుల బెడద పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఫ్రాన్స్‌తో పాటు అంతర్జాతీయ మీడియాలో ఈ అంశం గురించి విస్తృత చర్చ జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, డీడీటీ అనే క్రిమిసంహారక మందులను విపరీతంగా వాడటం వల్ల నల్లుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ, తర్వాత డీడీటీతో పాటు, ఇతర రసాయనాలు మానవులపై చూపే ప్రభావాల కారణంగా వాటిని నిషేధించారు.

నల్లులను అరికట్టేందుకు పిచికారి చేస్తున్న అధికారులు

Malaria Vaccine Approved By WHO : మలేరియా వాక్సిన్​కు WHO ఆమోద ముద్ర.. వ్యాధిపై పోరులో కీలక ముందడుగు

Yudh Abhyas Exercise Alaska 2023 : యుద్ధ అభ్యాస్.. భారత్- అమెరికా సైనిక దళాల పారా జంప్​.. వీడియో చూశారా?

ABOUT THE AUTHOR

...view details