Bangladesh Train Accident Today : ప్యాసింజర్ ట్రైన్, గూడ్స్ రైలు ఢీ.. 20 మంది మృతి
By PTI
Published : Oct 23, 2023, 5:29 PM IST
|Updated : Oct 23, 2023, 8:13 PM IST
17:26 October 23
Bangladesh Train Accident Today : బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం- అనేక మంది మృతి
Bangladesh Train Accident Today : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 20 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. రెండు రైళ్లు పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయని చెప్పారు.
అధికారుల సమాచారం ప్రకారం..సోమవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కిశోర్‌గంజ్ జిల్లాలోని భైరబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఢాకాకు వెళ్తున్న ఎగోర్సింధూర్ గోధూలీ ఎక్స్‌ప్రెస్ రైలును.. వెనుక నుంచి గూడ్స్ రైలును ఢీకొట్టింది. వెంటనే మూడు బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. వీటి కింద కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. పెద్ద క్రేన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్ చీఫ్ షాజహాన్ సిక్దర్ తెలిపారు. గూడ్స్ రైలు సిగ్నల్‌ను విస్మరించిందని బంగ్లాదేశ్ తాత్కాలిక జనరల్ మేనేజర్ నజ్ముల్ ఇస్లాం తెలిపారు. గూడ్స్ రైలు లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, గార్డును సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పూర్తిస్థాయి విచారణ కోసం రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.