Bangladesh Fuel Crisis: పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా శ్రీలంక మాదిరి పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. తాజాగా అక్కడ ఇంధన ధరలు ఒక్కసారిగా 52 శాతం మేర పెరిగాయి. ఆ దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ స్థాయిలో ఎన్నడూ ఇంధన ధరలు పెరగలేదని అక్కడి మీడియా పేర్కొంది. ఇలా భారీ స్థాయిలో ధరలను పెంచడంతో షేక్ హసీనా ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.
పెట్రోల్ ధర లీటరుకు ఒకేసారి 51.2 శాతం అనగా 44 టాకాలు (బంగ్లాదేశీ కరెన్సీ) పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీంతో లీటరు పెట్రోల్ ధర 130 టాకాలకు పెరిగింది. దీనితోపాటు లీటరు డీజిల్‌పై 34 టాకాలు, ఆక్టేన్‌పై 46 టాకాలు పెంచింది. పెట్రోల్, డీజిల్‌పై యాభై శాతం పెరగగా.. కిరోసిన్ ధర కూడా 42శాతం పెరిగింది. ఇలా ఇంధన ధరలను ఒకేసారి భారీ స్థాయిలో పెంచడంపై బంగ్లాదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బస్సు ఛార్జీలు కూడా పెంచుతున్నట్లు ఆపరేటర్లు ప్రకటించడంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఆందోళనలు మొదలుపెట్టారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, వీటిపై స్పందించిన ప్రభుత్వం.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇంధన ధరలను పెంచాల్సి వచ్చిందని ప్రకటించింది.