Bangladesh Election Result 2024 :బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా ఐదోసారి ఆ దేశ పగ్గాలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. పార్లమెంట్లో 300 స్థానాలకు గానూ 299 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా అవామీ లీగ్ 200 సీట్లలో గెలిచిందని ఎన్నికల సంఘం ప్రతినిధి వెల్లడించారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. 'ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా అవామీ లీగ్‌ను విజేతగా ప్రకటిస్తున్నాం. మిగిలిన నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తయ్యాక తుది ఫలితాలు వెల్లడిస్తాం' అని ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి వివరించారు.
వరుసగా ఎనిమిదోసారి విజయం
ప్రధాని షేక్ హసీనా తాను పోటీ చేసిన గోపాల్‌గంజ్-3 స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2,49,965 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప అభ్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన ఎం నిజాముద్దీన్ లష్కర్‌కు 469 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. 1986 నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిదోసారి ఆ స్థానం నుంచి విజయం సాధించారు హసీనా.
విపక్షాల బాయ్‌కాట్- 40 శాతమే ఓటింగ్
మొత్తం 300 స్థానాలకుగాను ఆదివారం 299 సీట్లకు జరిగిన పోలింగ్ హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది. తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలనే డిమాండ్‌తో ప్రధాని ప్రతిపక్షం BNPసహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ 40 శాతమే నమోదైంది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మందికి పైగా ప్రజలు ఓటేశారు.