Bangladesh Election Result 2024 :బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ భారీ విజయం సాధించినట్లు బంగ్లా ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 299 నియోజకవర్గాలకు గాను 223 సీట్లను గెలుచుకొని రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకున్నట్లు వెల్లడించింది. ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ 11 సీట్లకే పరిమితం కాగా, స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా 61 స్థానాల్లో విజయం సాధించినట్లు ప్రకటించింది.
'బంగ్లాకు భారత్ గొప్ప మిత్ర దేశం'
భారత్ తమకు గొప్ప మిత్రదేశమని ప్రశంసించారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలు అనేక సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించకున్నాయని చెప్పారు. 1971, 1975 యుద్ధాల్లో భారతీయులు తమకు ఎంతో మద్దతు ఇచ్చారని, ఆ సమయంలో తనకు, తన కుటుంబసభ్యులకు ఆశ్రయనిచ్చారని గుర్తు చేసుకున్నారు. ప్రతి దేశంతో మంచి సంబంధాలను కొనసాగించడమే తమ ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. దేశ ప్రజలందరినీ ఓ తల్లిలాగానే ప్రేమిస్తానని చెప్పారు. వారందరూ ఓట్లు వేయడం వల్లే తాను ఈరోజు ఈస్థాయిలో ఉన్నానని తెలిపారు. దేశ ఆర్థికరంగాన్ని ప్రగతి పథంలో నడిపించడమే వచ్చే ఐదేళ్లలో తమ లక్ష్యమని చెప్పారు. దిగ్గజ మహిళా నేతలు ఇందిరా గాంధీ, సిరిమావో బండారనాయకే లాంటి వారితో నన్ను పోల్చారని, వారంతా గొప్ప మహిళా నాయకులని ప్రశంసించారు.
గోపాల్‌గంజ్-3 స్థానంలో గెలుపొందిన ప్రధాని షేక్ హసీనా 1986 నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిదోసారి అక్కడ విజయం సాధించారు. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా అయిదోసారి అధికారాన్ని చేపట్టనున్నారు. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మాగుర అసెంబ్లీ స్థానం నుంచి ప్రత్యర్థి అభ్యర్థిపై లక్షా 85 వేల 388 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.