Ukraine Russia Conflict: అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు యుద్ధాన్ని కొనసాగించి తీరుతామని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన ఒకరోజు వ్యవధిలోనే ఆ దేశానికి చెంతనే ఉన్న నాలుగు బాల్టిక్ దేశాలు ఆయనకు ఝలక్ ఇచ్చాయి. ఉక్రెయిన్ కుప్పకూలిపోతే మున్ముందు తమకూ అదే గతి పడుతుందని ఆందోళన చెందుతున్న పోలండ్, లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియా దేశాల అధ్యక్షులు బుధవారం రైల్లో ప్రయాణించి కీవ్ చేరుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో వారు భేటీ అయ్యారు. ఈ నాలుగు దేశాలూ 'ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి' (నాటో)లో ఉన్నాయి. రాజకీయ, సైనికపరమైన సాయాన్ని అందించబోతున్నామనే బలమైన సందేశాన్ని ఇవ్వడమే తమ పర్యటన ప్రధానోద్దేశమని లిథువేనియా అధ్యక్షుడు గిటనస్ నౌసెదా తెలిపారు. సాధారణ పౌరుల ఊచకోత సహా రష్యా పాల్పడినట్లు చెబుతున్న యుద్ధ నేరాలపై ఆయన, ఎస్తోనియా అధ్యక్షుడు అలర్ కరిస్, పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, లాత్వియా అధ్యక్షుడు ఈగిల్స్ లెవిట్స్‌లతో చర్చించనున్నారు.
రష్యాకు అనుకూలంగా పరిస్థితులు!:కీలక నగరాల్లో ఒకటైన మేరియుపొల్‌లో వెయ్యి మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయినట్లు రష్యా ప్రకటించింది. ఆ నగరంలో పెద్దఎత్తున ఉక్రెయిన్ బలగాలు మోహరించిన విషయం తెలిసిందే. యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడు వారాలు కావస్తున్నా ఇప్పటివరకు ఈ నగరంపై రష్యా పట్టు సాధించలేకపోయింది. స్థానికుల చేయూత, మెరుగైన ఆయుధాలున్న సైనికులు, ఆ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాల వల్ల చివరకు రష్యాకు అనుకూలంగా పరిస్థితులు మారవచ్చని పోరాట వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ 36వ మెరైన్ బ్రిగేడ్‌కు చెందిన 162 మంది అధికారులు సహా 1,026 మంది సైనికులు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోయినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. ఇది ఎప్పుడు జరిగింది, మేరియుపొల్‌లో ఇంకెంతమంది ఉన్నారనేది స్పష్టం చేయలేదు.
బేస్‌మెంట్‌లోనే నెలరోజులుగా 300 మంది:తుపాకులతో బెదిరించి, నెలరోజులకు పైగా దాదాపు 300 మందిని ఒక పాఠశాల బేస్‌మెంటుకే రష్యా సైనికులు పరిమితం చేశారనీ, కాలకృత్యాలకు, వంటపనులకు మాత్రమే బయటకు వచ్చేవాళ్లమని చెర్నిహైవ్ సమీపంలోని యహిందే గ్రామ వాసులు చెప్పారు. అక్కడే ఒక్కొక్కరుగా పలువురు ప్రాణాలు విడిచిపెడుతున్నారని తెలిపారు.