Bakhmut Russia Winning : భీకర పోరు తర్వాత బఖ్‌ముత్ నగరం తమ సొంతమైనట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా బలగాల సహకారంతో వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇదే తరహా ప్రకటనను వాగ్నర్ గ్రూప్ చేసిన 8 గంటల తర్వాత టెలిగ్రామ్ ఛానల్‌లో రష్యా రక్షణ శాఖ ప్రకటన చేసింది.
అయితే ఉక్రెయిన్ మాత్రం తమ సైనికులు ఇంకా బఖ్‌ముత్‌లో ఉన్నారని, పోరాడుతున్నారని తెలిపింది. బఖ్‌ముత్ కోసం పోరాటం ఏకంగా 8 నెలల పాటు సాగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అత్యంత రక్తపాతం చోటు చేసుకున్నది బఖ్‌ముత్‌లోనే కావడం గమనార్హం. బఖ్‌ముత్‌ను స్వాధీనం చేసుకున్నందుకు వాగ్నర్ ప్రైవేట్ ఆర్మీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలిపారు.
రష్యా చేతిల్లోకి 'బఖ్‌ముత్' సిటీ.. వాగ్నర్‌కు పుతిన్ కంగ్రాట్స్ Bakhmut Russia Ukraine war : బఖ్‌ముత్ కోసం 8 నెలల పాటు భీకరపోరు సాగింది. ఇందులో ఎవరు ఎక్కువగా నష్టపోయారు అనే దానిపై స్పష్టత లేదు. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ వేల సంఖ్యలోనే సైనికులను కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. రష్యా ఆధీనంలోని దొనెత్స్క్‌కు 55 కిలోమీటర్ల దూరంలో బఖ్‌ముత్ ఉంటుంది. ఇక్కడ యుద్ధానికి ముందు 80 వేల మంది నివసించేవారు. ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా బఖ్‌ముత్ ఉండేది. సాల్ట్, జిప్సమ్ గనులు బఖ్‌ముత్ చుట్టూ ఉన్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా బఖ్‌ముత్ విలసిల్లేది. కానీ ఇప్పుడు అక్కడ ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. అయితే, భీకర దాడుల్లో 20వేలనుంచి 30వేల మంది రష్యా సైనికులు మృతి చెందినట్లు అంచనా. ఇటు ఉక్రెయిన్ సైన్యం కూడా భారీగా ప్రాణనష్టం చవిచూసింది.
Bakhmut City Zelensky : మరోవైపు బఖ్‌ముత్ కోసం తమ సైన్యం వీరోచితంగా పోరాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అక్కడ ఏమీ మిగల్లేదన్నారు. బఖ్‌ముత్‌లో ప్రతి దానిని రష్యన్లు నాశనం చేశారన్నారు. కేవలం శిథిలమైన భవనాలు మాత్రమే మిగిలాయని ఇది ఎంతో విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి బఖ్‌ముత్ తమ మనసుల్లో మాత్రమే ఉందని జెలెన్‌స్కీ వెల్లడించారు.
రష్యా చేతిల్లోకి 'బఖ్‌ముత్' సిటీ.. వాగ్నర్‌కు పుతిన్ కంగ్రాట్స్ "మా సైన్యం వీరోచితంగా పోరాడింది. రష్యన్లు చెబుతున్నట్లుగా అక్కడ ఏమీ మిగల్లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రతి దానిని రష్యన్లు నాశనం చేశారు. కేవలం శిథల భవనాలు మాత్రమే మిగిలాయి. ఇది ఎంతో విషాదకరం. ప్రస్తుతానికి బఖ్‌ముత్ మా మనసుల్లో మాత్రమే ఉంది" అని జెలెన్‌స్కీ వెల్లడించారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. రష్యా ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానమిచ్చారు.