Baby Born By Emergency C Section In Gaza :ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ..గాజాలో కళ్లు తెరవకుండానే తల్లి గర్భంలోనే అనంతవాయువుల్లో కలిసిపోవాల్సిన పసిగుడ్డుకు వైద్యులు ప్రాణం పోశారు. తీవ్ర గాయాలతో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న గర్భిణీకి పురుడు పోశారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో బిడ్డను కాపాడారు. ఆ తర్వాత తల్లిని కాపాడేందుకు కూడా వైద్యులు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు.
అక్టోబరు 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు జరిపిన మెరుపుదాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై భీకరంగా దాడులు చేస్తోంది. మంగళవారం ఖాన్ యూనిస్ పట్టణంలోని ఓ నివాసంపై ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడుల్లో ఓ గర్భిణీ తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయస్థితిలో ఉన్న గర్భిణీని సహాయక బృందాలు సమీపంలోని ఆస్పత్రికి తరలించాయి. వైద్యులు అత్యవసరంగా సిజేరియన్ శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులోని బిడ్డను కాపాడారు.
శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పసిగుడ్డు ప్రాణాలు కాపాడిన వైద్యులపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలజల్లు కురుస్తోంది. పురుడు పోసిన తర్వాత.. ఉదరం నుంచి తీవ్ర రక్తస్రావంతోపాటు అనేక చోట్ల ఫ్రాక్చర్ అయిన గర్భిణీకి వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆమెను కాపాడలేకపోయినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అంతకుముందే ఆమె భర్త కూడా చనిపోయినట్లు అధికారులు తెలిపారు.