Azerbaijan Vs Armenia Conflict Ceasefire :నాగర్నో-కారబఖ్ ప్రాంతంలో గత రెండు రోజులుగా జరుగుతున్న భీకర దాడులకు ఎట్టకేలకు తెరపడింది. అజర్‌బైజన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అర్మేనియన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ ప్రాంతంలో రష్యా శాంతి పరిరక్షక బృందంతో చర్చల ద్వారా ఈ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా నాగర్నో-కారబఖ్ నుంచి అర్మేనియన్ సైనిక దళాలు, సామగ్రిని ఉపసంహరించుకోవడం సహా స్థానిక రక్షణ దళాలను నిరాయుధులను చేయడం వంటివి ఉన్నట్లు తెలుస్తోంది.
Armenia Azerbaijan Ceasefire News :
మంగళవారం నాగర్నో-కారబఖ్ ప్రాంతంలో అజర్‌బైజన్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 100 మంది మరణించారు. కొన్ని వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్నో-కారబఖ్ నుంచి అర్మేనియన్లను వెళ్లగొట్టేందుకు ఈ దాడులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే అజర్‌బైజన్ మాత్రం దీనిని ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా చెబుతోంది. అక్కడ ఉన్న అర్మేనియన్ ప్రజల హక్కులను కాపాడేందుకే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు చెబుతోంది. రష్యాకు చెందిన శాంతి పరిరక్షక దళాలు ఇక్కడి నుంచి 2వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
అజర్‌బైజన్, అర్మేనియా మధ్య కాల్పుల విరమణ జరగక ముందు వరకు నాగర్నో-కారబఖ్ ప్రాంతంలోని స్థానికులు నివాస బేస్‌మెంట్లు, బాంబ్ షెల్టర్లలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకున్నారు. బాంబు దాడుల వల్ల విద్యుత్తు నిలిచిపోవడం వల్ల రెండు రోజులుగా చీకట్లోనే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పలు భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘర్షణల్లో గాయపడిన వారికి శాంతి పరిరక్షణ దళాలు తక్షణమే వైద్యసాయం అందించాలని రష్యా విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది.