తెలంగాణ

telangana

ETV Bharat / international

కోహినూర్‌ సహా ఆంగ్లేయులు కొల్లగొట్టినవెన్నో

ఆంగ్లేయులు మన విలువైన సంపదను దోచుకెళ్లారనగానే చాలామందికి గుర్తుకొచ్చేది.. బ్రిటన్‌ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్‌ వజ్రమే. కానీ భారత్‌ను 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్‌ వారు అంతకన్నా ఎన్నో రెట్ల విలువైన అపూర్వ కళాఖండాలు, సౌందర్య శిల్పాలు, వెలకట్టలేని వస్తు సంపదను కొల్లగొట్టుకుపోయారు. ఇలా దోచుకెళ్లిన సుమారు 40 వేలకు పైగా చారిత్రక, వారసత్వ ఆధారాలు లండన్‌లోని విక్టోరియా, ఆల్బర్ట్‌ మ్యూజియంలో నేటికీ కాంతులీనుతున్నాయి!

Azadi Ka Amrit Mahotsav
కోహినూర్‌ సహా ఆంగ్లేయులు కొల్లగొట్టినవెన్నో

By

Published : Aug 15, 2022, 12:58 PM IST

'టిప్పు' ఉంగరాలు..
1799లో జరిగిన యుద్ధంలో మైసూర్‌ మహారాజు టిప్పుసుల్తాన్‌ను హత్య చేసిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాలు ఆయన ఆభరణాలు, వస్తు సామగ్రినీ వదిలిపెట్టలేదు. టిప్పు ధరించిన రత్న ఖచిత ఖడ్గం, బంగారు ఉంగరం, సింహాసనంలోని కెంపులు, పచ్చలు, వజ్రాలు పొదిగిన బంగారు పులి తల, అత్తరు చెక్కతో చేసిన పులిబొమ్మ (మెకానికల్‌ టైగర్‌)ను అపహరించుకుపోయారు. తర్వాత వాటిని వేలం వేసి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారు. టిప్పు వస్తువులు కొన్ని ఇప్పటికీ లండన్‌ మ్యూజియంలో ఉన్నాయి.

'ఝాన్సీ' రాణి ఆభరణాలు..
ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగదెబ్బతీసి 1858లో చంపేశాక ఆమె ప్యాలెస్‌ నుంచి ఎన్నో బంగారు, వెండి ఆభరణాలు, నాణాలు, డబ్బులు ఎత్తుకెళ్లారు. ఎంతో ఖరీదైన కుర్చీలు, మంచాలు, పరుపులు, దుప్పట్లూ పట్టుకెళ్లారు. కనీసం తలుపులు, కిటికీలు, వాటి బోల్టులు, కుండలు, చిప్పలనూ వదలకుండా ఎత్తుకెళ్లారంటే ఎంతగా లూటీ చేశారో అర్థంచేసుకోవచ్చు.

రంజిత్‌ సింహాసనం..
పంజాబ్‌ చక్రవర్తి రంజిత్‌సింగ్‌ కోసం హఫీజ్‌ మహ్మద్‌ ముల్తానీ అనే స్వర్ణకారుడు 1820-1830 మధ్యకాలంలో ఓ సింహాసనాన్ని తయారు చేసి ఇచ్చాడు. కలప, బంక, లోహాలతో తయారు చేసిన సింహాసనానికి బంగారుపూత పూశారు. తామర పువ్వు ఆకారాన్ని పోలిన ఈ సింహాసనాన్ని మహారాజా రంజిత్‌సింగ్‌ చాలా అపురూపంగా చూసుకుంటూ అరుదుగా కూర్చునేవారు. రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం తరవాత 1849లో ఈస్ట్‌ ఇండియా కంపెనీ దీన్ని స్వాధీనపరచుకుంది. ఆ తరవాత బ్రిటన్‌కు తరలించుకుపోయింది.

షాజహాన్‌ మధు పాత్ర..
మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్‌ మద్యం తాగడానికి ప్రత్యేకమైన, ఖరీదైన పాత్రను వినియోగిస్తుండేవాడు. షాజహాన్‌ 1657 ప్రాంతంలో వైట్‌ నెఫ్రేట్‌ రాయితో వంగి ఉన్న పక్షి ఈక ఆకారంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ మద్యపాన పాత్రను తయారు చేయించుకున్నారు. కల్నల్‌ ఛార్లెస్‌ సెటన్‌ గుత్రీ దీనిపై కన్నేసి 19వ శతాబ్దంలో దొంగిలించారు.

మన అమరావతి అందాలూ..
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో బ్రిటిష్‌ పాలకుల కాలంలో వెలుగుచూసిన బౌద్ధమతానికి చెందిన శిల్పాలు, విగ్రహాలు, శాసనాలు, చేతితో గీసిన చిత్రాలు లండన్‌ మ్యూజియంలో ఉన్నాయి. చలవరాయితో చెక్కిన దాదాపు 120కి పైగా శిల్పాలను ఆ మ్యూజియంలో చూడొచ్చు. సంస్కృతం, అరబ్బీ, పార్సీ, జపనీస్‌ భాషల్లోని తాళపత్ర గ్రంథాలు, నాణేలనూ తరలించుకుపోయారు. మధ్యప్రదేశ్‌లోని ధర్‌ ప్రాంతానికి చెందిన సుందరమైన పాలరాతి అంబికా విగ్రహం బ్రిటిష్‌ ప్రభుత్వంలో పనిచేసిన జనరల్‌ విలియం కిన్‌కెయిడ్‌ కంటపడింది. తొమ్మిదో శతాబ్దానికి చెందిన విగ్రహం కొన్నాళ్లపాటు కనిపించకుండా పోయింది. చివరకు ఈ దేవతా విగ్రహం బ్రిటిష్‌ మ్యూజియంలో దర్శనమిచ్చింది.

ఓ దశలో తాజ్‌మహల్‌పై 'మనసు పారేసుకున్న' బ్రిటిష్‌ పాలకులు దానికీ ఎసరుబెట్టారు. తాజ్‌ను కూల్చి పాలరాతిని నౌకలో లండన్‌కు చేరవేయాలని 1830లో అప్పటి గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటింక్‌ ప్రణాళిక రూపొందించారు కూడా. ఇది ఖరీదైన వ్యవహారం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
సిక్కు చక్రవర్తి రంజిత్‌సింగ్‌ కుటుంబం నుంచి కొట్టేసిన కోహినూర్‌ వజ్రం బ్రిటిష్‌ రాణి ఆభరణాల్లో ఒకటై దిగిపోయింది. ప్రస్తుతం అది లండన్‌లోని జ్యువెల్‌ హౌజ్‌లో దర్పం ప్రదర్శిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details