Ayodhya Ram Mandir Invitation List :ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ నెల 22న జగరనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలకు ఆహ్వానాలు ఇచ్చిన ఆలయ కమిటీ సభ్యులు- విదేశాల్లోని ప్రముఖులకు సైతం ఆహ్వానం అందించారు. దాదాపు 55 దేశాలకు చెందిన వంద మంది ప్రాణప్రతిష్ఠకు ( Ayodhya Pran Pratishtha guests ) విచ్చేయనున్నారు. ఇందులో ఎంపీలు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని ప్రపంచ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానానంద తెలిపారు. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్ రాణికి కూడా ఆహ్వానించినట్లు వెల్లడించారు.
అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్, హాంకాంగ్, కెనడా, ఇటలీ, ఐర్లాండ్, మెక్సికో, న్యూజిలాండ్ సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నట్లు విజ్ఞానానంద తెలిపారు. దేశాధినేతలు కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జనవరి 20న లఖ్‌నవూకు చేరుకోనున్న విదేశీ అతిథులు- జనవరి 21న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు అవుతారని వివరించారు. పొగ మంచు, వాతావరణ పరిస్థితులు కారణంగా అతిథులు ముందుగానే కార్యక్రమానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దసంఖ్యలో విదేశీ అతిథులను పిలవాలని అనుకున్నామని కానీ అయోధ్య చిన్న నగరం కావడం వల్ల పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు ఇచ్చినట్లు వెల్లడించారు.