తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2023, 3:26 PM IST

ETV Bharat / international

పార్లమెంట్​లో మహిళా ఎంపీపై లైంగిక దాడి..

Woman MP Harassed In Parliament : మహిళలకు చట్ట సభల్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. సాక్షాత్తు పార్లమెంట్ భవన ప్రాంగణంలో ఓ మహిళా ఎంపీ లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ అవమానకరమైన ఘటన ఆస్ట్రేలియా పార్లమెంట్​లో జరిగింది.

Women MP Harassed In Parliament
పార్లమెంట్​లో మహిళా ఎంపీకి వేధింపులు

Women MP Harassed In Parliament : ఆస్ట్రేలియా దేశ పార్లమెంట్‌ వేదికగా ఓ చట్టసభ సభ్యురాలికి ఘోర అవమానం జరిగింది. తనపై తోటి పార్లమెంట్​ సభ్యుడు అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యంలో దేవాలయంగా కొలుచుకునే ఈ పార్లమెంట్‌ భవనంలో మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సెనేట్‌ సభలో ఆమె ఉద్విగ్నభరిత ప్రసంగం చేశారు.

పార్లమెంట్‌లో ఓ శక్తిమంతమైన తన తోటి ఎంపీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ స్వతంత్ర మహిళా సెనేటర్‌ ఆరోపించారు. కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ డేవిడ్‌ వాన్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. గురువారం సెనేట్‌లో ప్రసంగిస్తూ తనపై జరిగిన వేధింపులను వివరించారు.

"నాతో డేవిడ్‌ వాన్‌ అసభ్యంగా ప్రవర్తించేవారు. అభ్యంతరకరంగా నన్ను తాకేవారు. శృంగార కార్యకలాపాల కోసం పదే పదే నాకు ప్రతిపాదనలు పంపేవారు. ఆయన చర్యల వల్ల ఆఫీసు గదిలో నుంచి బయటకు రావాలంటేనే నాకు భయం వేసేది. ఎప్పుడైనా బయటికి వెళ్లాలంటే.. డోర్‌ కొంచెం తెరిచి అక్కడ ఆయన లేరు అని నిర్ధరించుకున్న తర్వాతే వెళ్లేదాన్ని. పార్లమెంట్ ప్రాంగణంలో నడిచేటప్పుడు కూడా తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకుంటున్నా. నాలాగే మరికొందరు కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని నాకు తెలుసు. కానీ, వాళ్ల భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుందేమో అన్న భయంతో వారు బయటకు మాట్లాడంలేదు. మహిళలకు ఈ పార్లమెంట్​ భవనం సురక్షిత ప్రదేశం కాదని నా అభిప్రాయం"

- మహిళా ఎంపీ

పార్లమెంట్ నియమ నిబంధనలకు లోబడి ఈ ఘటనపై తాను సెనేటర్‌ డేవిడ్‌ వాన్​పై కేసు పెట్టనున్నట్లు మహిళా ఎంపీ తెలిపారు. అయితే, కన్జర్వేటివ్‌ ఎంపీ డేవిన్‌ వాన్‌.. మహిళా ఎంపీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆమె చేసిన వ్యాఖ్యలన్నీ వాస్తవాలు కావని కొట్టిపారేశారు. ఈ వ్యవహారంపై తాను చట్టపరంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కాగా.. ఇంతకుముందు కూడా ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇలాంటి ఘటన జరిగింది. గతంలో ఓ మహిళ కూడా పార్లమెంట్‌లో తనపై అత్యాచారంజరిగిందని ఆరోపణలు చేసింది. 2019 మార్చిలో పార్లమెంట్‌లోని అప్పటి రక్షణమంత్రి లిండా రెనాల్డ్‌ ఆఫీస్‌లో పనిచేసే ఓ సీనియర్‌ సిబ్బంది.. సమావేశం ఉందని తనను పిలిచి అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో నాటి ప్రధాని స్కాట్‌ మారిసన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత మహిళకు క్షమాపణలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details