Antonio Guterres On Palestine :పాలస్తీనాను 56 ఏళ్లుగా ఇజ్రాయెల్ అణచివేస్తోందంటూ ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు చేసింది. హమాస్ ఇటీవల చేసిన దాడి ఒక్కసారిగా జరిగింది కాదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఐరాస భద్రతా మండలి మినిస్టీరియల్ సదస్సులో పాల్గొన్న ఆయన.. 56 ఏళ్లుగా పాలస్తీనీయులపై అణచివేత సాగుతోందని వివరించారు. ఇజ్రాయెల్ చేసే సెటిల్‌మెంట్లు, హింసతో పాలస్తీనీయులు తమ సొంత భూమిని కోల్పోయారని ఐరాస చీఫ్ తెలిపారు.
పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని.. ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారనీ తమ సమస్యకు రాజకీయ పరిష్కారం దొరుకుతుందన్న ఆశ.. పాలస్తీనా ప్రజల్లో సన్నగిల్లిందని ఐరాస చీఫ్ పేర్కొన్నారు. హమాస్ దాడుల పేరిట పాలస్తీనీయులను శిక్షించడం సరైనది కాదని హితవు పలికారు. దీనికి 2 దేశాల ఏర్పాటే సరైన పరిష్కారమని వెల్లడించారు. పరమత వ్యతిరేకతతో స్వమత దురహంకారాన్ని పంచే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. గాజాలో పరిస్థితి దారుణంగా ఉందని ఐరాస శిబిరాల్లో ఏకంగా 6 లక్షల మంది తలదాచుకున్నారని గుటెరస్ పేర్కొన్నారు. అత్యధిక జనసాంద్రత ఉన్న గాజాలో 10 లక్షల మందిని ఒకేసారి వేరే చోటుకు వెళ్లిపోవాలని హెచ్చరించడం సరైనది కాదన్నారు.
రాజీనామాకు డిమాండ్..
పాలస్తీనాను ఇజ్రాయెల్ 56 ఏళ్లుగా అణచివేస్తోందన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. ఐరాస చీఫ్‌గా గుటెరస్ తన పదవికి రాజీనామా చేయాలని ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ డిమాండ్ చేశారు. హమాస్ చేసిన సామూహిక హత్యలపై కనికరం చూపే వ్యక్తి ఐరాస సెక్రటరీజనరల్‌గా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నారని ఐరాస చీఫ్‌ను ప్రశ్నించారు.