అంతర్జాతీయ వేదికగా దాయాది పాకిస్థాన్ ఆగడాలను భారత్ మరోసారి ఎండగట్టింది. ఉగ్రవాదం ముప్పు ఎక్కడి నుంచి మొదలైందో ఈ ప్రపంచం మర్చిపోలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇకనైనా ఆ దేశం తమ చేష్టలను మార్చుకుని, పొరుగు దేశాల పట్ల స్నేహంగా ఉండాలని హితవు పలికారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఓసారి పాకిస్థాన్‌పై చేసిన ‘పాము’ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. దాయాదిపై నిప్పులు చెరిగారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ ప్రపంచం అవలంభించాల్సిన విధానాలపై ఐరాస భద్రతా మండలిలో భారత్ అధ్యక్షతన చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం జైశంకర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల పాకిస్థాన్ మంత్రి ఒకరు భారత్‌ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల పై మీడియా జైశంకర్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘ఆ మంత్రి అన్న వ్యాఖ్యలు నేను కూడా విన్నాను. ఇక్కడో విషయం వారికి గుర్తుచేయాలి. ఓ దశాబ్దం క్రితం హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఆమె పాకిస్థాన్‌ను ఉద్దేశిస్తూ.. ‘పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు.. అవి కేవలం పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించకూడదు. చివరికి అవి వారిని కూడా కాటేస్తాయి’ అని చెప్పారు. కానీ పాకిస్థాన్‌కు మంచి సలహాలు తీసుకునే అలవాటు లేదు. ఇప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు’’ అని దాయాదిని ఘాటుగా విమర్శించారు.