తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2023, 6:41 AM IST

ETV Bharat / international

మరోసారి కంపించిన భూమి.. తుర్కియే, సిరియాల్లో 34వేలు దాటిన మృతుల సంఖ్య

తుర్కియేలో మరోసారి భూమి కంపించింది. ఆదివారం తుర్కియే దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో మరోసారి భయాందోళన రేకెత్తింది. మరోవైపు, గతవారం సంభవించిన భూ ప్రళయంలో మృతుల సంఖ్య 34 వేలు దాటింది.

turkey syria earthquake
turkey syria earthquake

తుర్కియే, సిరియాలను గత వారం శక్తిమంతమైన భూకంపం కకావికలం చేయగా తాజాగా మరోసారి భూమి కంపించింది. ఆదివారం తుర్కియే దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో మరోసారి భయాందోళన రేకెత్తింది. మరోవైపు తుర్కియేలోని హతాయ్ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. భూకంపం ధాటికి ధ్వంసమైన విమానాశ్రయాన్ని వేగంగా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. గతవారం తుర్కియే, సిరియాలో సంభవించిన భూ ప్రళయంలో మృతుల సంఖ్య 34 వేలు దాటింది.

తుర్కియేలోని హతే ప్రాంతంలో 128 గంటల తర్వాత... రెండు నెలల పాపని సహాయక బృందాలు ప్రాణాలతో రక్షించాయి. 70 ఏళ్ల వృద్ధురాలు, ఆరు నెలల గర్భిణిని సైతం సహాయక బృందాలు కాపాడాయి. మరోవైపు గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. భూకంపం ధాటికి మరణించిన....వేలాదిమందిని ఖననం చేయడానికి తుర్కియేలోని అంతక్య ప్రాంతంలో తాత్కాలిక శ్మశానవాటిక నిర్మించారు. బుల్డోజర్లతో గుంతలను తవ్వి ఖననం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మృతదేహాలతో అంబులెన్సులు, ట్రక్కులు.. శ్మశానవాటికకు నిరంతరాయంగా వస్తున్నాయి.

గుత్తేదారులపై ప్రభుత్వం చర్యలు
భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో భవనాలు కుప్పకూలిన విషయం తెలిసిందే. వీటిని నిర్మించిన 130 మంది గుత్తేదారులపై అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు తుర్కియే అధికారులు వెల్లడించారు. వీరిలో ఏడుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోవైపు ఇక్కడి పరిస్థితులను ఆసరాగా చేసుకుని దోపిడీలకు, మోసాలకు పాల్పడుతున్న ముఠాలను కట్టడి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details