లాటరీ దక్కడమే గొప్ప అదృష్టంగా భావిస్తారు చాలామంది. అదే లాటరీ భారీ స్థాయిలో కోట్ల రూపాయలతో మనల్ని పలకరిస్తే.. కనీవినీ ఎరుగని స్థాయిలో కాసుల వర్షం కురిపిస్తే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. దీంతో అప్పటి వరకు సాదాసీదా జీవితం గడిపే మనిషి దశే మారిపోతుంది. కన్న కలలన్నీ నిజం చేసుకునే అవకాశం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అచ్చం ఇలాంటి అదృష్టమే అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఓ వ్యక్తిని వరించింది.
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఓ వ్యక్తి ఏకంగా రూ.6,536 కోట్లకు పైగా సొమ్మును లాటరీలో గెలుచుకున్నారు. అమెరికా డాలర్లలో దీని విలువ 754.6 మిలియన్ల డాలర్లు. పవర్‌బాల్ లాటరీ గేమ్‌లో ఈ భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నారు ఆ వ్యక్తి. ఒక టికెట్ మొత్తం ఆరు నంబర్లు(05, 11, 22, 23, 69, 07)తో సరిపోలిందని.. దీని మొత్తం విలువ రూ.6,536.46 కోట్లకు పైనే అని లాటరీ నిర్వాహకులు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే.. ఆ వ్యక్తి ఎవరో ఇంకా తెలియలేదు.