తెలంగాణ

telangana

By

Published : Feb 12, 2023, 11:44 AM IST

ETV Bharat / international

కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు.. కూల్చేసిన అమెరికా ఫైటర్ జెట్​

అమెరికా గగనతలంలో శనివారం అనుమానాస్పద వస్తువును ఫైటర్‌ జెట్‌ కూల్చేయగా.. ఇప్పుడు కెనడాలోనూ ఇలాంటి వస్తువు సంచారమే కలకలం రేపింది. దీన్ని అమెరికా ఫైటర్ జెట్ కూల్చేసింది.

Suspicious object shot down in Canadian airspace
కెనడా గగనతలంలో అనుమానాస్పద వస్తువు కూల్చివేత

శనివారం అలస్కా గగనతలంలో కారు లాంటి వస్తువును కూల్చేయగా.. ఆదివారం కెనడాలో అలాంటి వస్తువునే అమెరికా ఫైటర్‌ జెట్‌లు కూల్చేశాయి. రెండు రోజుల వ్యవధిలో గగనతలంలో రెండు వస్తువులను కూల్చేయడం భయాలను పెంచుతోంది. కెనడా-అమెరికా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టగా.. అమెరికాకు చెందిన ఎఫ్-22 ఫైటర్‌ జెట్‌ ఆ వస్తువును పేల్చేసిందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ట్వీట్ చేశారు. ధ్వంసమైన వస్తువు శిథిలాలపై అమెరికా- కెనడా పరిశోధనలు జరుపుతున్నాయి. దీనిపై తాను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో మాట్లాడినట్లు ట్రూడో చెప్పారు. తమ సార్వభౌమాధికారాన్ని ఎప్పుడూ కాపాడుకుంటామని కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ ట్వీట్‌ చేశారు.

అంతకుముందు, శనివారం అలస్కా ఉత్తర తీరంలో 40వేల అడుగుల ఎత్తులో పేలోడ్లతో ఉన్న ఓ వాహనం ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన అమెరికా అధికారులు.. వెంటనే యుద్ధవిమానంతో దాన్ని కూల్చేశారు. ఈ వస్తువు గురువారమే అమెరికా గగనతలంలోకి ప్రవేశించినట్లు పెంటగాన్‌ మీడియా కార్యదర్శి బ్రిగేడియర్‌ జనరల్‌ పాట్రిక్‌ రైడర్‌ తెలిపారు. పౌర విమానయాన రాకపోకలకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో శుక్రవారం మధ్యాహ్నం దాన్ని కూల్చేసినట్లు వెల్లడించారు. ఈ వాహనం గురించి అధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం అందిన వెంటనే.. దాన్ని కూల్చివేయాలని మిలిటరీకి అధ్యక్షుడు ఆదేశాలిచ్చినట్లు వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ తెలిపారు.

కాగా, వారం క్రితం తమ గగనతలంలో చక్కర్లు కొడుతూ తమ అణు స్థావరాలపై నిఘా పెట్టిన చైనా బెలూన్​ను అమెరికా ఇటీవలే కూల్చివేసింది. దక్షిణ కరోలీనా తీరానికి దగ్గర్లో దాన్ని కూల్చేసినట్టు పెంటగాన్ తెలిపింది. అట్లాంటిక్ సముద్రంలో పడిపోయిన బెలూన్ శిథిలాలను, అందులోని పరికరాలను స్వాధీనం చేసుకొని.. వాటిని పరిశీలిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details