భారతీయులకు అమెరికా గుడ్న్యూస్ చెప్పింది. భారత్‌లో వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. వీసా ప్రాసెసింగ్ వేగంగా జరగడం కోసం అమెరికా నుంచి ప్రత్యేక కాన్సులర్ బృందం భారత్ వస్తున్నట్లు వీసా సేవల అధికారి జూలీ స్టఫ్ట్ తెలిపారు. వీసా వెయిటింగ్ సమయాన్ని 120 రోజులకు తగ్గించడమే లక్ష్యంగా ఈ బృందం పనిచేస్తుందని వెల్లడించారు.
గుడ్న్యూస్.. రంగంలోకి అమెరికా అధికారులు.. తగ్గనున్న వీసా వెయిటింగ్ టైమ్! - america trying for reducing visa times
భారత్‌లో వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇందుకోసం అమెరికా నుంచి అధికారులను భారత్కు పంపిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల అమెరికాకు వెళ్లడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తుంటారు. భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వీసాల కోసం దరఖాస్తులు భారీగా పెరిగాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వీసా అప్రువల్ సమయం తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు తమ కాన్సులర్ అధికారులను భారతదేశానికి పంపుతున్నామని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ తెలిపారు. వీసా సమయాన్ని తగ్గించడానికి, ఇంటర్వ్యూలు సకాలంలో పూర్తి చేయడం కోసం ఈ బృందం పనిచేస్తుందని తెలిపారు.
ఈ విషయంలో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నట్లు స్టఫ్ట్ తెలిపారు. భారతీయ వీసా దరఖాస్తుదారుల కోసం జర్మనీ, థాయ్లాండ్ వంటి దేశాల్లో కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 'విదేశాల నుంచి వృత్తి నిపుణులను తీసుకోవడం కోసం ఇచ్చే H-1Bవీసా, L1 వీసాల సమయాన్ని 18 నెలల నుంచి 60 రోజులకు తగ్గించాము. మిగతా వీసాల అప్రువల్ సమయాన్ని తగ్గించడం కోసం మరింత ప్రయత్నిస్తా'మని స్టఫ్ట్ తెలిపారు.